సింగరేణి ఉద్యోగం కోసం కన్నతండ్రినే చంపిన తనయుడు
By తోట వంశీ కుమార్ Published on 7 Jun 2020 1:32 PM IST
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగానే మారిపోతున్నాయి. ఉద్యోగం కోసం కన్న తండ్రినే హత్య చేశాడో కొడుకు. అతడికి తల్లి కూడా సహకరించింది. ఈ అవమానవీయ ఘటన పెద్దపల్లి జల్లా ధర్మారం మండలంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నర్సయ్య(55) గోదావరి ఖనిలో సింగరేణి పంపు ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు తిరుపతి పాలిటెక్నిక్ పూర్తిచేయగా, చిన్న కొడుకు రాకేశ్ ఐటీఐ చదువుతున్నాడు. ఉద్యోగ విరమణ పొందడానికి సిద్దంగా ఉన్న నర్సయ్య కొంత కాలంగా తన కుటుంబ సభ్యులకు డబ్బులు ఇవ్వడం లేదు. అతడి భార్య తార తన పెద్ద కొడుకు తిరుపతికి సింగరేణి ఉద్యోగం దక్కాలంటే భర్తను హతమార్చాలనుకున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 23న పథకం ప్రకారం తార తనకు అనారోగ్యంగా ఉందని చిన్న కొడుకు రాకేష్‌తో కలిసి గోదావరిఖనికి వెళ్లింది. 25న కొత్తూరులో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న నర్సయ్య మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అనంతరం నిద్రపోగా.. తిరుపతి అతడి గొంతు నులిపి హత్య చేశాడు. అనంతరం ఏమీ ఎరుగనట్లు అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు.
అనంతరం తండ్రి గుండె పోటుతో చనిపోయాడని అందరిని నమ్మించాడు. కానీ అధికారులకు అనుమానం రావడంతో నర్సయ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.