సీబీఐ చేతికి అమ‌రావ‌తి భూకుంభ‌కోణం కేసు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 March 2020 2:11 PM GMT
సీబీఐ చేతికి అమ‌రావ‌తి భూకుంభ‌కోణం కేసు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ గత టీడీపీ ప్రభుత్వం ఢంకా మోగించి మరీ చెప్పుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక అక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీన్ని తెలుగుదేశం నాయకులు తప్పుబట్టారు. ఆ పార్టీ అధినేత ప్రజా చైతన్య యాత్రకు పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో అమరావతి విషయంలో అతి పెద్ద భూకుంభకోణం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం మొదటి నుండి చెబుతోంది. తాజాగా అమరావతి భూ కుంభకోణంపై సీబీఐకి బాధ్యతలు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూకుంభకోణానికి పాల్పడ్డారని, అవకతవకలు జరిగాయని తేల్చిన కేబినెట్ సబ్ కమిటీ సీబీఐకి దర్యాప్తును అప్పగించింది.

ఓత్ ఆఫ్ సీక్రెసీని గత ప్రభుత్వం ఉల్లంఘించి.. తమ ఆప్తులకు, టీడీపీ నేతలకు భూములు అప్పజెప్పినట్లు చెబుతోంది.. ముఖ్యంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు కేబినెట్ సబ్ కమిటీ చెబుతోంది.. అందుకు సంబంధించిన వివరాలను సేకరించి 2019, డిసెంబర్ 27న నివేదికను ఇచ్చింది. సీఆర్డిఏ పరిధిలో ఉన్న కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఏకంగా 4609. ఎకరాల భూ కుంభకోణం ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా జరిగినట్లు సబ్ కమిటీ తేల్చింది.

గుంటూరు జిల్లాలోని తాడికొండ వద్ద ఉన్న కంతేరు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోసం 14 ఎకరాలను కొన్నారని నివేదిక ప్రకారం చెబుతున్నారు. 2014 లోనే ఈ డీల్ జరిగిందని.. లింగమనేని రమేష్, లింగమనేని రాజశేఖర్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. లింగమనేని గ్రూప్ కు రాజధాని ఏరియాకు సంబంధించిన డిజైన్ పనులు అప్పగించడం.. వీరు భూములు కొన్న గ్రామాలకు దగ్గరగా రాజధాని ప్రాంతానికి చెందిన సరిహద్దు రావడం కూడా జరిగాయి. కానీ వీరు కొన్న భూములు ల్యాండ్ పూలింగ్ లో ప్రభుత్వం తీసుకోకపోవడం కొసమెరుపు అని ప్రస్తుత ప్రభుతం ఆరోపిస్తోంది.

ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా అచ్చం అలాగే డిజైన్ చేశారట. LEPL ప్రాజెక్ట్స్ కు కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఇన్నర్ రింగ్ రోడ్ ను ఆపేశారట. వీరికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృష్ణా నది ఒడ్డున ఉండవల్లిలో రెండస్థుల బిల్డింగ్ ఇచ్చి.. అది కూడా రెంట్ లేకుండా ఉండమని చెప్పిందట..!

అమరావతి భూముల స్కామ్ కు సంబంధించి సిఐడీ ఇప్పటికే రెండు కేసులు పెట్టింది. ఆ కేసులను సీబీఐకి అప్పగించింది. గత సబ్ రిజిస్ట్రార్ లను విచారించిన సిఐడీ.. అధికారం పలుకుబడి ఉన్న కొందరు వ్యక్తుల కారణంగా అస్సైన్డ్ భూములను కొందరికి అప్పనంగా అప్పజెప్పినట్లు తెలుసుకున్నారు. 500 కోట్ల రూపాయల విలువైన 500 ఎకరాల భూమిని చాలా తక్కువ ధరకే షెడ్యూల్డ్ కులాలకు చెందిన రైతుల నుండి అతి తక్కువ ధరకే తీసుకున్నట్లు కూడా ఆరోపించింది.

హెరిటేజ్ ఫుడ్స్ ప్రెసిడెంట్ ఎం.సాంబ శివ రావు ఈ ఆరోపణలను ఖండించారు. హెరిటేజ్ ఫుడ్స్ మీద వరుసగా ఇలాంటి ఆరోపణలు రావడం తమకు చాలా ఇబ్బందిగా ఉందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లాలో అమరావతికి చెందిన 29 గ్రామాల్లో ఎక్కడ కూడా తమ భూమి లేదని ఆయన అంటున్నారు. తాము కంతేరులో 14 ఎకరాల భూమిని కొనడానికి ముఖ్య కారణం డైరీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికే అని అన్నారు.. అది కూడా తాము జులై, ఆగస్టు 2014 లో కొన్నామని అన్నారు. తాము కొన్న భూమి గుంటూరుకు దాదాపు 20 కిలోమీటర్లు దూరంలో ఉందని అన్నారు.

కొన్ని కారణాల వలన 2014 అక్టోబర్ నెలలో 4.5 ఎకరాల భూమి తమ సంస్థ నుండి చేజారి పోయిందని ఆయన అన్నారు. తమ సంస్థకు కంతేరులో ఇప్పుడు కేవలం 9.6 ఎకరాల భూమి మాత్రమే ఉందని ఆయన అన్నారు. తమ వ్యాపార విస్తరణ కోసం మాత్రమే తాము కంతేరు లోని భూములను తీసుకున్నాము తప్పితే ఇన్సైడర్ ట్రేడింగ్ లో మాత్రం కాదని అన్నారు. 2014లో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ చాలా రాష్ట్రాల్లో భూమిని కొన్నదని ఆయన అన్నారు. మొత్తం 14 రాష్ట్రాల్లో తమ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

Next Story