హమ్మయ్యా.. ఇండియా మ్యాప్‌లో అమరావతి..!
By అంజి Published on 23 Nov 2019 10:55 AM ISTముఖ్యాంశాలు
- ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించిన సర్వే ఆఫ్ ఇండియా
- ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పత్రాల ఆధారంగా రాజధానిగా అమరావతి
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతో హోంశాఖ దిద్దుబాటు
- అమరావతి పేరు లేకపోవడంపై టీడీపీ ఎంపీల తీవ్ర అభ్యంతరం
ఢిల్లీ: ఇండియా మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి గుర్తింపు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ సర్వే ఆఫ్ ఇండియా కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. జమ్ము కశ్మీర్ మ్యాప్ తయారీ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏ నగరాన్ని సర్వే ఆఫ్ ఇండియా చూపించలేదు. దీంతో పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేకపోవడాన్ని టీడీపీ ఎంపీలు తప్పుబట్టారు. ఇండియా మ్యాప్‌లో అమరావతికి పేరు లేకపోవడం.. ఆంధ్రప్రదేశ్ జరిగిన అవమానమే కాదని.. ప్రధాని నరేంద్రమోదీ కూడా జరిగిన అవమానంగా జీరో అవర్‌లో టీడీపీ ఎంపీ గల్ల జయదేవ్ పేర్కొన్నారు. అమరావతి పేరు లేకపోవడం అంశం రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశముందని జయదేవ్ అభిప్రాయపడ్డారు. అమరావతి నగరానికి ప్రధాని మోదీనే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఇండియా మ్యాప్‌లో అమరావతి పేరు చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు డిమాండ్ చేశారు.
కేంద్రప్రభుత్వం జమ్ముకశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత అక్టోబర్ 21న ఇండియా పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో 28 రాష్ట్రాలు, 9 కేంద్రాలు పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే మ్యాప్‌లో కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాలకు రాజధానిని గుర్తించిన కేంద్రప్రభుత్వం... ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని మాత్రం చేర్చలేదు. దీంతో మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేకపోవడం తీవ్ర దుమారం రేగింది. ఇండియా పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేకపోవడంపై సెంట్రల్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పత్రాల ఆధారంగా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్రహోంశాఖ జరిగిన పొరపాటును సరిదిద్దింది.
స్పందించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ఇండియా పొలిటికల్ మ్యాప్‌లో అమరావతి పేరు లేకపోవడంపై కేంద్రహోంశాఖ సహాయక మంత్రి కిషన్‌రెడ్డి వెంటనే స్పందించారు. గల్లా జయదేవ్ నుంచి పాత పొలిటికల్ మ్యాప్‌ను తీసుకొని తప్పు సరిదిద్దుకు ఉపక్రమించారు. శుక్రవారం సర్వే ఆఫ్ ఇండియా అధికారులను పిలిపించిన హోంశాఖ అధికారులు.. పొలిటికల్ మ్యాప్‌లో అమరావతి పేరును చేర్పించారు. ఇది కేవలం పొరపాటు వల్ల జరిగిన తప్పిదమే తప్పా.. ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ కొత్త మ్యాప్ సమయంలో జరిగిన తప్పును సరిదిద్ది కొత్త మ్యాప్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. అయితే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న కారణంగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించడం వాస్తవం లేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా పేర్కొంటూ ఇదివరకే జీవో వెలువడిందంటూ గుర్తు చేశారు. పొలిటికల్ మ్యాప్‌లో అమరావతి పేరు లేకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రశ్నించారు. వారు లేవనెత్తిన అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లానన్నారు. పొరపాటును సరిదిద్దాం.. అంటూ ట్విట్టర్‌లో కొత్త పొలిటికల్ మ్యాప్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోస్టు చేశారు.