అల్లరోడిని పట్టించుకోండయ్యా.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Jun 2020 10:06 AM IST
అల్లరోడిని పట్టించుకోండయ్యా.!

తెలుగు ప్రేక్షకులను రాజేంద్ర ప్రసాద్ తర్వాత అంతగా అలరించిన కామెడీ హీరో అల్లరి నరేష్. ‘అల్లరి’తో మొదలుపెట్టి.. తొట్టిగ్యాంగ్, కితకకితలు, సీమశాస్త్రి, బ్లేడు బాబ్జీ, బెండు అప్పారావు, సుడిగాడు లాంటి కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడతను. ఒకప్పుడు అతడిని చూస్తే చాలు నవ్వొచ్చేది. చాలా ఏళ్ల పాటు మినిమం గ్యారెంటీ సినిమాలతో అతను అలరిస్తూ వెళ్లాడు.

కానీ ‘సుడిగాడు’ తర్వాత అతడికి కాలం కలిసి రాలేదు. గత ఏడెనిమిదేళ్లలో అతడికి ఒక్కటంటే ఒక్క హిట్టు లేదు. నరేష్ ఒకప్పుడు తమను అలరించిన తీరును దృష్టిలో ఉంచుకుని అతడికి ఓ హిట్టు వస్తే బాగుండని ప్రతి తెలుగు ప్రేక్షకుడూ ఫీలయ్యాడు. కానీ వాళ్ల ఆశ నెరవేరలేదు. గత కొన్నేళ్లలో నరేష్ కెరీర్ మరీ డల్లయిపోయింది. సినిమాలు బాగా తగ్గిపోయాయి. అతిథి పాత్రలో నటించిన ‘మహర్షి’ తప్పితే రిలీజ్‌లే లేవు నరేష్‌కు.

ఇలాంటి సమయంలో నరేష్ ఒకటికి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో ఒకటి నరేష్ స్టయిల్లోనే చేసిన కామెడీ మూవీ ‘బంగారు బుల్లోడు’ కాగా.. ఇంకోటి తన శైలికి భిన్నంగా చేసిన సీరియస్, ఇంటెన్స్ మూవీ ‘నాంది’. ‘బంగారు బుల్లోడు’ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ.. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది.

‘నాంది’ గత ఏడాది రెండో అర్ధంలో మొదలై చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న సినిమా. ఈ రెంటిలో ‘నాంది’ణే కొంచెం భిన్నంగా అనిపిస్తోంది. దీని పోస్టర్లలో నరేష్ సరికొత్తగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. తమిళంలో కొంచెం ‘రా’గా, వయొలెంట్‌గా తెరకెక్కే సినిమాల తరహాలో దీని లుక్స్ కనిపిస్తున్నాయి. దీని ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి.

మంగళవారం అల్లరోడి పుట్టిన రోజు సందర్భంగా దీని టీజర్ కూడా రిలీజ‌య్యింది. దీంతో పాటే ‘బంగారుబుల్లోడు’ టీజర్‌ను కూడా వదులుతున్నారు. ఇవి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి అల్లరోడి సినిమాలకు మళ్లీ మునుపటి క్రేజ్ రావాలని.. అతడికి మంచి హిట్ పడాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ రెండు టీజర్లు ఏ మేర అల్లరోడి పట్ల ఆకర్షణ పెంచుతాయో చూడాలి.

Next Story