ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు యావత్ భారతం జనతా కర్ఫ్యూను పాటిస్తోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే కరోనా వైరస్ బాధితులకు 24/7 నిర్విరామంగా వైద్య సేవలందిస్తోన్న డాక్టర్లకు అందరూ తమ కరతాల ధ్వనులతో అభినందనలు, కృతజ్ఞతలు తెలపాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు యావత్ దేశం కరతాల ధ్వనులతో వైద్యులకు అభినందనలు తెలిపింది. వైద్యో దేవో భవ అని ఊరికే అనలేదు. ఇంత కష్టసమయంలోనూ వైద్యులు తమ ప్రాణాలకు తెగించి మరి..కరోనా బాధితులకు సకాలంలో చికిత్సలు అందిస్తున్నారు.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా వంటి ప్రధాన నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు. చిన్నా, పెద్దా అంతా దూరందూరంగా ఉండి శంఖాలు మోగించారు. తీన్ మార్ డప్పులు, సన్నాయిలు, ప్లేట్లు మోగించి దేవుడి రూపంలో ఉన్నవైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, సిబ్బంది, కుటుంబంతో కలిసి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని, హరీశ్ రావు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలా రాజకీయ ప్రముఖులంతా తమ కరతాల ధ్వనులతో వైద్యులకు జేజేలు పలికారు. సినీ ప్రముఖులు సైతం వైద్యులను అభినందించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.