45 నిమిషాల్లోనే కరోనాను గుర్తించవచ్చు

By Newsmeter.Network  Published on  22 March 2020 10:35 AM GMT
45 నిమిషాల్లోనే కరోనాను గుర్తించవచ్చు

కరోనా వైరస్..దీనిని కట్టడి చేసేందుకు యావత్ భారత దేశం14 గంటల జనతా కర్ఫ్యూని పాటిస్తోంటే..అమెరికా మాత్రం వైరస్ ను గుర్తించేందుకు కొత్త పద్ధతిని కనిపెట్టింది. ఈ పద్ధతి వల్ల కేవలం 45 నిమిషాల్లోనే వైరస్ ఉందో లేదో గుర్తించవచ్చట. ఈ కొత్త వైరస్ పరీక్షా విధానానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శనివారం ఆమోదముద్ర వేసింది. కాలిఫోర్నియాకు చెందిన సెపైడ్ అనే వైద్య పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు ఈ నూతన పద్ధతిని కనిపెట్టారు. మార్చి 30వ తేదీ నాటికి ఈ నూతన పద్ధతి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ అజర్ వెల్లడించారు. ప్రపంచంలోని 23వేల ఆటోమేటెడ్ జీన్స్ ఎక్స్ పర్ట్ సిస్టమ్స్ పై ఈ వైద్య పరీక్ష ఫలితాలనిస్తుందని అజర్ పేర్కొన్నారు.

ప్రస్తుతం కరోనా వైద్య పరీక్షల రిపోర్టులు వచ్చేందుకు 38 - 42 గంటల సమయం పడుతోంది. నిత్యం ప్రపంచ వ్యాప్తంగా వేలమంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇక కరోనా వైరస్ లక్షణాలున్న వారు తమ ఆరోగ్యం పై ఆందోళన చెందుతున్నారు. కరోనా బాధితులకు చికిత్స చేసే వైద్యుల్లో 8 శాతం వైద్యులే దీని బారిన పడుతున్నారు. చైనాలో కరోనా వైరస్ ను గుర్తించిన మొదటి డాక్టరే..అదే వైరస్ సోకి మరణించడం బాధాకరం. ఇంకా చాలా మంది వైద్యులు వైరస్ సోకి ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారు.

వైరస్ భయంతో స్కూళ్లు, కాలేజీలు, దేవాలయాలు, దుకాణాలు, సాఫ్ట్ వేర్ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాలు, బస్టాండ్లు ఇలా అన్నీ మూతపడ్డాయి. ముగ్గురు మాత్రం ప్రజలకోసం పనిచేస్తున్నారు.

1.బాధితులకు చికిత్స అందజేస్తున్న వైద్యులు

2.ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

3.కరోనా పై వాస్తవాలను తెలియజేస్తున్న మీడియా ప్రతినిధులు

ఈ ముగ్గురికి..ముఖ్యంగా వైద్యులకు మనం ఎంతో రుణపడి ఉండాలి. ఎలాంటి పరిస్థితికైనా భయపడకుండా, కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేనప్పటికీ..అందుబాటులో ఉన్న మందులతోనే అందరినీ కాకపోయినా కొంతమంది ప్రాాణాలనైనా కాపాడిన వైద్యులకు హాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే..హాట్సాఫ్ డాక్టర్స్.

Next Story