గుడ్‌న్యూస్‌: మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి..!

By సుభాష్  Published on  1 May 2020 3:02 PM GMT
గుడ్‌న్యూస్‌: మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి..!

గ్రీన్‌ జోన్‌లలో మద్యం షాపులు, పాన్‌ షాపులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ షాపుల వద్ద ఆరు అడుగుల దూరం ఉంటూ సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం తప్పని సరి అని, ఒక షాపు వద్ద ఒకేసారి ఐదుగురికి మించి ఉండవద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా, దేశ వ్యాప్తంగా మే 3వ తేదీతో లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో మే 17వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ పొడిగిస్తూ శుక్రవారం సాయంత్రం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

అయితే మార్చి 25వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రాగా, దేశ వ్యాప్తంగా మద్యం షాపులు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్రాలకు పెద్ద ఆదాయం అయిన మద్య షాపులు మూతపడటంతో భారీ మొత్తంలో రాష్ట్రాలకు గండిపడింద. మద్యం దొరక్కపోవడంతో ఎంతో మంది పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం, కొందరు ఆత్మహత్యకు ప్రయత్నంచడం, మెంటల్‌ ఆస్పత్రుల్లో చేరడం లాంటివి ఎన్నో జరిగాయి. మద్యం దొరకకపోవడంతో మందుబాబులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.

ఇక అదే అదనుగా భావించిన కొందరు అక్రమార్కులు బ్లాక్‌ దందాకు ఎగబడ్డారు. అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కైన సందర్భాలు చాలా ఉన్నాయి. మద్యం దొరక్క కొందరు వైన్స్‌ షాపుల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. కేరళ వంటి రాష్ట్రాలు పరిమిత మద్యం విక్రయించేందుకు ప్రయత్నాలు కొనసాగించగా, కోర్టులు అంగీకరించలేదు.

మద్యం విక్రయాలు కొనసాగితే ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని న్యాయస్థానాలు అభిప్రాయడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లో మద్యం విక్రయాలు జరపవద్దని ఆదేశించింది. ఇక తాజాగా కేంద్ర హోంశాఖ గ్రీన్‌ జోన్‌లలో మద్యం షాపులు, పాన్‌ షాపులకు అనుమతి ఇవ్వడంతో మద్యం ప్రియులకు ఊపిరి పోసినట్లయింది.

Next Story