ఏపీ మందు బాబుల తిప్పలు.. తెలంగాణకు కాసుల పంట..

By అంజి  Published on  22 Feb 2020 8:15 AM GMT
ఏపీ మందు బాబుల తిప్పలు.. తెలంగాణకు కాసుల పంట..

హైదరాబాద్‌: 'ఏపీలో దొరకని మందు తెలంగాణకు కాసుల విందు' అంటూ ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి కథనం రాసింది. ఆ పత్రిక కథనం ప్రకారం... ఏపీ రాష్ట్రంలో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీలో మద్యం రేట్లను వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచింది. ఇందులో భాగంగా మందుబాబులకు ఇష్టమైన బ్రాండ్లను కాకుండా.. కొత్త బ్రాండ్లను విక్రయిస్తోంది. మరోవైపు తెలంగాణలోని మద్యం షాపుల్లో ఏపీ మందుప్రియులకు ఇష్టమైన బ్రాండ్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి. దీంతో మందుప్రియులు తెలంగాణ సరిహద్దులోని వైన్‌షాపుల్లో క్యూ కడుతున్నారు. ఫలితంగా తెలంగాణకు భారీ ఆదాయం సమకూరుతుండగా.. ఏపీకి మద్యం ఆదాయం తగ్గిపోతోంది.

గతంలో తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మద్యం దుకాణాల్లో రోజుకు రూ.లక్ష వరకు మందు విక్రయం జరిగేది. ఇప్పుడు అది రూ.5-10 లక్షలకు వరకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని వీరులపాడు మండలం జయంతి, జుజ్జూరు దుకాణాల్లో రోజు మొత్తం కలిపి రూ.2 లక్షల మద్యం విక్రయాలు మాత్రమే జరుగుతున్నాయి. అయితే ఇదే మండలాన్ని ఆనుకొని ఉన్న తెలంగాణకు చెందిన ఎర్రుపాలెంలో మద్యం విక్రయాలు దీనికి రెండింతలు ఎక్కువగా ఉంది. ఎర్రుపాలెంలోని మద్యం దుకాణంలో రూ.6లక్షలు, మీనవోలు దుకాణంలో రూ.5 లక్షలు, దెందుకూరు, మడుపల్లి దుకాణాల్లో రూ.3 లక్షల చొప్పున మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకొని ఉన్న తెలంగాణ సరిహద్దుల్లో జోరుగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో మద్యం విక్రయం ద్వారా ఆదాయం సమకూరుతోంది. జగ్గయ్యపేట మండలం షేర్‌ మహ్మద్‌పేట, గండ్రాయి దుకాణాలు రోజుకు రూ. 2లక్షల మద్యం విక్రయం చేస్తుండగా.. అక్కడి నుంచి కూతవేటు దూరంలో ఉన్న రామాపురంలోని క్రాస్‌రోడ్డు వద్ద గల దుకాణం ఒక్కటే రూ.10 లక్షల వరకు మద్యం విక్రయిస్తోంది. ఏపీలో మద్యం పాలసీ వల్ల మందుబాబుకు తెలంగాణకు చెందిన గ్రామాల్లోని మద్యం దుకాణాల్లో క్య కడుతున్నారు. తెలంగాణకు లిక్కర్‌ను ఆంధ్రాకు తరలించి బెల్లుషాపుల ద్వారా విక్రయిస్తుండడంతో తెలంగాణకు చెందిన కొల్లాపూర్‌, దోమలపెంట, పెంటవెల్లిలో మద్యానికి గిరాకీ పెరిగింది. మర్లకుంటలో అయితే మందుబాబు క్యూ కడుతుంటే.. తిరువూర్‌ బార్‌లో మద్యం ధర అధికంగా ఉండడంతో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ గ్రామాలకు తరలివస్తున్నారు. అలంపూర్‌ మండలంలోని మద్యం దుకాణాలకు కర్నూలు జిల్లా మందుబాబులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

ఏపీలో చీప్‌ లిక్కర్‌కు ఉన్న ధర.. తెలంగాణలోని బ్రాండ్లకు ఉంది. దీంతో సరిహద్దులోని ఏపీ మందుబాబులు తెలంగాణ దుకాణాలకు తరలుతున్నారు. ఏపీలో లైట్‌ బీర్లు సైతం అందుబాటులో ఉండడం లేదు. వాటి స్థానంలో కొత్త బ్రాండ్లను అమ్ముతున్నారు. ఏపీలో క్వార్టర్‌ బాటిల్‌కు రూ., ఫుల్‌ బాటిల్‌కు రూ.120 దాకా అధికంగా ధరలు ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్రమ మద్య రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఏపీతో సరిహద్దు పంచుకుంటున్న తమిళనాడులో సైతం మద్యం ప్రియుళ్లతో మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి.

Next Story