ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అఖిలప్రియ
By తోట వంశీ కుమార్ Published on 5 Jun 2020 4:34 PM ISTమాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ, ఆమె భర్తతో కలిసి తనను చంపేందుకు కుట్ర పన్నారని ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలపై అఖిల ప్రియ స్పందించారు. తనను అరెస్ట్ చేయాలని సుబ్బారెడ్డి చేసిన డిమాండ్ వెనకున్న ఉద్దేశ్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఆయన ఆరోపణల వెనుక ఆళ్లగడ్డ వైసీపీ నేతల హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా.. వైసీపీ అధిష్ఠానం ప్రమేయం ఉండకపోవచ్చునన్నారు.
గత అక్టోబర్ లో తన భర్త భార్గవ్ రామ్ బెదిరిస్తున్నాడని ఓ క్రషర్ ఇండస్ట్రీ యజమాని ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారని, దీనికి సంబంధించి బెయిల్ కోసం తాము దరఖాస్తు చేశామన్నారు. ఈ సమయంలో సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తుండటం అందరూ గమనించాల్సిన విషయమని తెలిపారు. సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో తన హస్తం ఉన్నట్టు బయటకు రాలేదని, ఏ4 ముద్దాయిగా తనకు ఎలాంటి నోటీసులు కూడా అందలేదన్నారు.
విచారణ కొనసాగుతున్న తరుణంలో తనను అరెస్టు చేయాలని వ్యాఖ్యానించడం సుబ్బారెడ్డికి తగదన్నారు. తన తండ్రి బినామీ ఆస్తులు సుబ్బారెడ్డి పేరు మీద ఉంటే.. అవీ ఆయనకే చెందుతాయన్నారు. తమ మధ్య ఆస్తిగొడవలు లేవన్న విషయాన్ని గతంలోనే బహిరంగంగానే సుబ్బారెడ్డి చెప్పాడన్న విషయాన్ని గుర్తు చేశారు అభిలప్రియ. సుబ్బారెడ్డికి పదవులు ఇచ్చినా తాను అడ్డు చెప్పలేదని అన్నారు. ఆళ్లగడ్డలో సుబ్బారెడ్డి రాజకీయాలు చేయాలనుకుంటే తాను స్వాగతిస్తానని వ్యాఖ్యానించారు. ఆళ్లగడ్డలో గంగుల కుటుంబంతో కొట్లాడి కార్యకర్తలకు పనులు ఎలా చేయిస్తారో తనకు కూడా చూడాలని ఉందని చెప్పారు.