ఢిల్లీ లోని ఎయిర్ ఇండియా ఆఫీసును రెండు రోజుల పాటూ మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ఆఫీసులో పని చేసే ప్యూన్ కు కరోనా వైరస్ పాజిటివ్ అని తెలియడంతో ఆఫీసును మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఆఫీసులో పని చేసే ప్రతి ఒక్కరూ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ సింగ్ ఖరోలా కూడా ఇంట్లో నుండే పని చేస్తున్నట్లు మంగళవారం నాడు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది.

ప్రస్తుతం ఆఫీసును మొత్తాన్ని శానిటైజ్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా అక్కడ 200 మంది వరకూ ఉంటారు అని అధికారులు తెలిపారు. కోవిద్-19 పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హోమ్ క్వారెంటైన్ లో ఉంచారు.

అయిదుగురు ఎయిర్ ఇండియా పైలట్లను కరోనా వచ్చిందంటూ వార్తలు రావడంతో అందరూ తెగ టెన్షన్ పడ్డారు. వారికి సోమవారం నాడు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. వారందరూ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ పైలట్లు.. సరిగా పని చేయని కిట్లను ఉపయోగించడం వలన వారందరికీ మొదట పాజిటివ్ అని వచ్చింది. కానీ మరోసారి సరైన టెస్టింగ్ కిట్స్ ను ఉపయోగించి పరీక్షలు నిర్వహించగా.. వాళ్లకు నెగటివ్ అని వచ్చింది.

ఒక టెక్నీషియన్ కు, డ్రైవర్ కు కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. వీళ్లకు రీ టెస్ట్ చేయించారా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ వీరిని క్వారెంటైన్ లో ఉంచారు.

ముంబై కి చెందిన అయిదుగురు పైలట్లకు శనివారం నాడు పరీక్షలు నిర్వహించగా.. వారికి పాజిటివ్ అని వచ్చింది. దీంతో వాళ్ళను హోమ్ క్వారెంటైన్ లో ఉంచారు. కానీ టెస్టింగ్ కిట్స్ లో తప్పులు ఉన్నాయని గుర్తించి.. తిరిగి వారికి టెస్టులు నిర్వహించగా అవి కాస్తా నెగటివ్ అని వచ్చాయి. వారిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో రీ టెస్టులు నిర్వహించారు. వారు చివరి సారిగా విధులు నిర్వహించింది ఏప్రిల్ 20న. ఈ అయిదుగురు పైలట్లు RT-PCR టెస్ట్ కోసం క్యూ లైన్స్ లో నిలబడ్డారు. కానీ RT-PCR కిట్స్ లో లోపాలు ఉన్నట్లు తెలియడంతో రీటెస్టులు నిర్వహించారు.

విదేశాల్లో ఉన్న భారతీయులను.. భారత్ కు తీసుకుని రావడానికి ఎయిర్ ఇండియా ‘ఆపరేషన్ వందే భారత్’ కు శ్రీకారం చుట్టింది. మే 7 నుండి మే 15 వరకూ ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 15000 మంది భారతీయులను 64 విమానాల్లో తీసుకుని రానున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *