ముఖ్యాంశాలు

  • రాష్ట్రాలకు మే 15 టార్గెట్‌

  • రాష్ట్రాల నివేదికపైనే మోదీ నిర్ణయం

  • లాక్‌డౌన్‌ పొడిగిస్తే ఆంక్షలు కఠినంగా ఉంటాయా..ఉండవా..

  • కేంద్రం నిర్ణయమేంటీ..?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక దేశంలో విధించిన లాక్‌డౌన్‌ మే 17వ తేదీతో ముగియనుంది. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌పై ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. అయితే కొన్నిరాష్ట్రాలు మే17 తర్వాత లాక్‌డౌన్‌ పొడిగించాలంటే.. మరి కొన్ని రాష్ట్రాలు అవసరం లేదని చెప్పాయి. మరి కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ సడలింపుల విషయంలో కొన్ని అభ్యంతరాలు తెలిపాయి. మొత్తం మీద మే 17 తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వీలైతే ఎక్కువగా సడలింపులు ఇవ్వాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు మే 15 వరకు రిపోర్టు చేయాలని మోదీ కోరినట్లు తెలిసింది.

కేంద్రం చెబుతున్న మాట ఇదేనా..

ఒక వేళ మే 18 తర్వాత లాక్‌డౌన్‌ కొనసాగినా.. పేరుకు మాత్రమే లాక్‌డౌన్‌ అని.. నిబంధనలు పెద్దగా ఉండవని, సడలింపులు ఎక్కువగా ఉంటాయని కేంద్ర వర్గాల ద్వారా సమాచారం. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో పాటు ప్రపంచ దేశాలను నుంచి తీవ్ర విమర్శలు వచ్చే అవకాశాలున్నాయి. కరోనా పూర్తిగా కట్టడి కాలేనందున లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తివేస్తారని డబ్ల్యూహెచ్‌వో ప్రశ్నించే అవకాశం ఉంది. అంతేకాదు కరోనా కేసుల సంఖ్య పెరిగితే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

రాష్ట్రాల నివేదికపైనే ఆధారం..

ఇప్పుడు లాక్‌డౌన్‌ -4 ఎలా ఉండాలనేది నిర్ణయించే బాధ్యత రాష్ట్రాలపైనే ఉంది. మే 15వ తేదీ వరకూ రాష్ట్రాలు ఇచ్చే నివేదికలను కేంద్రం రెండు రోజుల పాటు పరిశీలించి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

మే 17 తర్వాత రాష్ట్రాలు ఏం చేయాలనుకుంటున్నాయి..

మే 17వ తేదీ తర్వాత రాష్ట్రాలు ఏం చేయాలనుకుంటున్నాయో ఇచ్చే నివేదికల ద్వారా తేలనుంది. కరోనా కేసులు పెరగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి, ఎలా చేస్తే కరోనా కట్టడిలోకి వస్తుంది… తదితర అంశాలను బ్లూప్రింట్‌ రిపోర్టులో తెలియజేయాల్సి ఉంటుంది.

ఒక వేళ లాక్‌డౌన్‌ పొడిగించాలని సూచించినా..ఈనెలాఖరు వరకూ పొడిగించి పెద్దగా ఆంక్షలు లేకుండా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. పెద్దగా కండీషన్లు ఏవి ఉండవని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా లాక్‌డౌన్‌ పొడిగించినా భారతీయులకు పెద్దగా కఠినమైన ఆంక్షలేవి ఉండవని తెలుస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *