తెలంగాణ: తగ్గినట్లే తగ్గి మళ్లీ కలవరపెడుతున్న కరోనా.. ఒక్క రోజే 79

By సుభాష్  Published on  12 May 2020 1:32 AM GMT
తెలంగాణ: తగ్గినట్లే తగ్గి మళ్లీ కలవరపెడుతున్న కరోనా.. ఒక్క రోజే 79

చైనా జన్మస్థలమైన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక భారత్‌లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కట్టడికి మే 17వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుంటే.. తెలంగాణలో మాత్రం మే 29 వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. అయితే ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా.. తెలంగాణలో మాత్రం గత వారం రోజులుగా తగ్గిపోయాయి. కానీ సోమవారం ఒక్క రోజే 79 కేసులు నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

నిన్న తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అది కూడా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1275 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన

కాగా, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గత 14 రోజులకు పైగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కావడం లేదు. ఒక్క హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పైగా హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి సంఖ్య భారీగానే ఉంటున్నాయి. పోలీసులు ఎన్ని విధాలుగా చెప్పినా జనాలు పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించి వాహనాలతో రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సైతం సీజ్ చేశారు.

ఇంట్లోనే ఉండండి అని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా..వాహనాలతో రోడ్లపైకి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మొదట్లో కరోనా కేసులు నెమ్మదిగా ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఉదాంతం తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి.

పెరిగిన వాహనాల రద్దీ

ఇక మూడో దశ లాక్‌డౌన్‌లో రూల్స్ ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. నగరంలో దాదాపు 35 శాతం వరకు వాహనాల రద్దీ పెరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా 79 కరోనా కేసులు నమోదు కావడంపై మరింత భయాందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుంటే మున్ముందు మరింత ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఇటీవల సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రెడ్‌జోన్‌, గ్రీన్‌ జోన్‌, ఆరెజ్‌ జోన్‌లను ప్రకటించారు. ఇప్పుడు రెడ్‌ జోన్‌లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అధికారులు.

రెడ్‌ జోన్‌ జిల్లాలు :

హైదరరాబాద్‌, సూర్యాపేట, మేడ్చల్, రంగారెడ్డి

గ్రీన్‌జోన్‌ జిల్లాలు:

యాదాద్రి, వరంగల్‌, వనపర్తి, సిద్దిపేట, భద్రాది, ములుగు,

మహబూబాబాద్‌‌, నగర్‌ కర్నూలు, పెద్దపల్లి జిల్లాలు.

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు:

సంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల్‌, మంచిర్యాల, నారాయణపేట, సిరిసిల్ల, నల్లగొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, జనగామ, కోమురం భీం, నిర్మల్‌,జోగులాంబ జిల్లాలున్నాయి.

అయితే హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధి తప్ప మిగతా జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కావడం లేదు. దీంతో జిల్లాల్లో లాక్‌డౌన్‌ కొన్ని సడలింపులు ఇచ్చారు. సడలింపులు ఇచ్చినా ఆయా జిల్లా కలెక్టర్లు, పోలీసులు జాగ్రత్తలు చేపడుతున్నారు. కొత్తగా కేసులు నమోదు కాకపోయినా కొన్ని రోజుల పాటు జాగ్రత్తగానే ఉండాలంటున్నారు నిపుణులు.

Hyderabad GHMC corona

Next Story