అమరావతి: ఎస్వీబీసీ చైర్మన్‌, నటుడు పృథ్వీరాజ్‌పై వైసీపీ అధిష్టానం గుర్రుగా ఉంది. రాజధాని రైతులపై పృథ్వీ ఇష్టానుసారంగా మాట్లాడటంపై అధిష్టానం సీరియస్‌ అయ్యింది. పృథ్వీపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వైసీపీ పార్టీ సిద్ధమయ్యినట్లు తెలుస్తోంది. కులాలు ప్రస్తావిస్తూ ఎవర్నీ కించపర్చేలా మాట్లాడొద్దని పార్టీ నాయకులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. రాజధాని ఆందోళనల్లో ముసుగులో గుద్దులాటలా కొందరు పెయిడ్‌ ఆర్టిస్టులు ఆందోళన చేస్తున్నారంటూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గుంటూరు జిల్లాలో ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీ దిష్టిబొమ్మ ఏర్పాటు చేసి అమరావతి రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులతో పోల్చినందుకు నిరసన తెలిపారు. పృథ్వీ ఫొటోను రైతులు, మహిళలు చెప్పులతో కొట్టారు. పృథ్వీపై ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై నటుడు, వైఎస్‌ జగన్‌ అభిమాని పోసాని కృష్ణ మురళీ కూడా తీవ్రంగా స్పందించారు. రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజధాని రైతులు కారుల్లో తిరగకూడదా, మహిళలు బంగారు గాజులు కొనుక్కొడదా అంటూ ప్రశ్నించారు. రైతులు గౌరవంగా బతుకుతున్నారని, వారిపై ఇలా మాట్లాడం సరికాదని పోసాని కృష్ణ మురళీ అభిప్రాయపడ్డారు.

తాజాగా రైతులకు క్షమాపణ చెప్పాలన్న పోసాని వ్యాఖ్యలపై పృథ్వీ స్పందించారు. పోసాని వ్యాఖ్యలను ఆశీర్వదంగా భావిస్తానన్నారు. సీఎం జగన్‌ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా పృథ్వీ పేర్కొన్నారు. తానే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలనే.. అమరావతి ఆందోళనలపై కామెంట్లు చేశానన్నారు. అమరావతి ఆందోళనలో రైతుల ముసుగులో కొంతమంది పెయిడ్‌ ఆర్టిస్టులనే తాను విమర్శించానని పృథ్వీ చెప్పుకొచ్చాడు. రైతులపై నాకు సముచిత గౌవరం ఉందని పృథ్వీ పేర్కొన్నాడు. తెలుగుదేశం పార్టీనే మొదటగా పెయిడ్‌ ఆర్టిస్ట్‌ల సంస్కృతి తీసుకొచ్చిందన్నారు. అయితే రాజధాని ఆందోళనల్లో మాత్రం ఖచ్చితంగా పెయిడ్‌ ఆర్టిస్టులు ఉన్నారని పృథ్వీ మరోసారి కామెంట్‌ చేశారు. దీంతో ఆయనపై వైసీపీ ప్రభుత్వం సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.