అమరావతి రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు
By సుభాష్ Published on 15 Sept 2020 12:20 PM ISTఏపీ రాజధాని అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ దూకుడు పెంచింది. రాజధాని భూకుంభకోణంపై మంగళవారం ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కేసు నమోదు చేసింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ప్రాథమిక నివేదికల ఆధారంగా ఏసీబీ లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు సిద్దమవుతోంది. రాజధాని విషయం ప్రకటించకముందే భూములు ఎవరెవరు కొన్నారు అనే కోణాలు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజధాని ప్రకటనకు ముందే టీడీపీకి చెందిన కొందరు నేతలు, ప్రముఖులు దాదాపు 4,075 ఎకరాలు కొనుగోలు చేశారు. అందులో 900 ఎకరాల అసైన్డ్ భూములను దళితుల నుంచి అక్రమంగా కొనుగోలు చేసినట్లు తేలినట్లు తెలుస్తోంది. కాగా, భూములు కొన్నవారిలో తెల్లరేషన్ కార్డుదారులతో పాటు టీడీపీ నేతలు, సన్నిహితులు, బినామీల భూములు కొన్నట్లు అధికారులు గుర్తించారు.
2015, సెప్టెంబర్ 3న గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రకటన చేశారు. అంతకు ముందే 2014, జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిగాయని, 1977 అసైన్డ్ భూముల చట్టం, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టం ఉల్లంఘించారని నిర్ధారణ అయ్యింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. లాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలోభూముల సమీకరణ విషయంలో కుంబకోణం జరిగిందనే అంశాన్ని ఇప్పటికే వైసీపీ ప్రస్తావించింది. ఈ క్రమంలో భూముల కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సీఆర్డీఏ పరిధిలో వేలాది ఎకరాల భూకుంభకోణం జరిగిందని, రికార్డులు కూడా తారుమారు చేశారని వైసీపీ ఆరోపిస్తుండగా, అటు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌లో అవినీతి చోటు చేసుకుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ రెండింటిపై సీబీఐ దర్యాప్తు కోరాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే వీటిపై సీబీఐ దర్యాప్తు కోరినా.. కేంద్రం నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడంపై వైసీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు.