కన్నీటి జ్ఞాపకం: 51 మంది జల సమాధికి ఏడాది
By సుభాష్ Published on 15 Sept 2020 9:55 AM ISTపాపికొండలు.. ఇదో అందమైన ప్రదేశం. ప్రకృతి అందాలను తిలకించేందుకు ఎందరో పర్యాటకులు ఈ పాపికొండల అందాలను తిలకిస్తుంటారు. కానీ ఇప్పుడు పాపికొండలు గుర్తొస్తేనే భయం పుట్టొస్తుంది. తూర్పుగోదావరిజిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన పడవ ప్రమాదానికి ఏడాది పూర్తయ్యింది. ఈ కన్నీటి విషాదానికి ఏడాది పూర్తయినా.. ఆ విషాద ఘటనలు కళ్లముందే కదలాడుతున్నాయి. కచ్చులూరు బోటు ప్రమాదం ఘటన గుర్తు తెచ్చుకుంటేనే కన్నీరు ఆగడం లేదు. పాపికొండల్లో విహార యాత్రకు బయలుదేరిన వశిష్ట బోటు మునిగిపోయింది. ఈ బోటులో మొత్తం 77 మంది వరకు ఉండగా, 51 మంది జలసమాధి అయ్యారు. అయితే ఇందులో 48 మృతదేహాలు లభ్యం కాగా, ముగ్గురి మృతదేహాలు ఇప్పటికి అచూకీ లభించలేదు. గత ఏడాది సెప్టెంబర్ 15న జరిగిన ఈ ప్రమాదం విషాదంగానే మారిపోయింది.
బోటు ప్రమాదం జరిగిన రోజు నుంచి 38 రోజుల తర్వాత మృతదేహాలను ఆచూకీ లభించింది. ఆ సమయంలో బాధిత కుటుంబాలు పడ్డ బాధ వర్ణానాతీతం. కన్నీటి రోధనలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. తమవాళ్లు ఎక్కడో ఓ చోటు ప్రాణాలతో బతికి ఉంటారని ఆ కుటుబాలు ఎంతో ఆశగా ఎదురు చూడగా, వారి ఆశలు అడియాశలయ్యాయి. వాళ్ల మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వారి కన్నీటిని ఆపరేందుకు ఎవరితరం కాలేకపోయింది.
ఈ ఘటన ఇటు తెలంగాణలో కూడా విషాదం నింపింది. మంచిర్యాల జిల్లాకు చెందిన రమ్యశ్రీ మృతదేహం ఇప్పటికి లభించలేదు. దీంతో నాటి విషాదాన్ని తలుచుకుంటూ ఇప్పటికి ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. అటు వరంగల్ జిల్లాలోనూ బాధిత కుటుంబాలు సైతం ఈ చేదు జ్ఞాపకాన్ని తలుచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటు
పాపికొండల్లో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటును కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం దాదాపు నెల రోజుల తర్వాత వెలికి తీసింది. లంగర్లు వేశారు, స్టాంగ్ రోప్‌లను కట్టారు.. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా మొదట్లో ఫలించలేదు. ఆ తర్వాత ధర్మాడి బృందం బోటును బయటకు తీసింది. అయితే ఈ బోటు ప్రమదానికి ఎన్నో కారణాలున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, అనుమతులు లేకుండా లాంచీలు నడపడం, బోటు యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో అనుమానాలు వెలుగు చూశాయి. తెలుగు రాష్ట్రల్లో ఈ బోటు ప్రమాదం ఎప్పటికీ విషాదంగానే మిగిలిపోయింది.
మృతుల కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా
కాగా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షలు, స్వల్పంగా గాయపడిన బయటపడిన వారికి రూ.లక్ష చొప్పున అందజేశారు. తెలంగాణ వారికి అక్కడి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున అదనంగా అందించింది. ఇక కేంద్రం నుంచి రూ.2 లక్షల చొప్పున సాయం అందించింది. ఈ ప్రమాదంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రమాదం పై సమగ్ర విచారణ జరిపింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది.