కూతురి కోసం ఆ సీన్లకు దూరమయ్యాడట..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jun 2020 1:46 PM IST
కూతురి కోసం ఆ సీన్లకు దూరమయ్యాడట..

అమితాబ్ బచ్చన్ ఘనవారసత్వందుకుని బాలీవుడ్లోకి అడుగు పెట్టిన నటుడు అభిషేక్ బచ్చన్. అతను తెరంగేట్రం చేసి 20 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కొన్ని రోజులుగా కెరీర్ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అమితాబ్ కొడుకునైనప్పటికీ తన అరంగేట్రం అంత తేలిగ్గా జరగలేదని.. తనను హీరోగా పరిచయం చేయమని చాలా మంది దర్శకులు, నిర్మాతలను అడుక్కోవాల్సి వచ్చిందని.. చివరికి జేపీ దత్తా తనను హీరోను చేశారని ఇంతకుముందు వెల్లడించాడు అభిషేక్.

అమితాబ్ కొడుకు అరంగేట్రానికి ఇంత కష్టమా అని అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అభిషేక్ మరో ఆశ్చర్యకర విషయం చెప్పాడు. తనకు కూతురు (ఆద్య) పుట్టినప్పటి నుంచి ఇంటిమేట్ సీన్లకు దూరంగా ఉంటున్నానని.. ఈ కారణంతో ఎన్నో సినిమాలు వదులుకున్నానని అభిషేక్ వెల్లడించాడు.

‘‘నా కూతురు పుట్టాక ఆలోచన దృక్పథం మారిపోయింది. ఒక విషయం మార్చుకోవాలని నిర్ణయించుకున్నా. హీరోయిన్లతో ఇంటిమేట్ సీన్లు చేయొద్దని నిర్ణయించుకున్నా. నేను అలాంటి సన్నివేశాల్లో నటించి.. కొంచెం ఊహ తెలిశాక ఆద్య వాటిని చూసి ‘ఏంటివి’ అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అనిపించింది. అందుకే ఆ సీన్లకు దూరంగా ఉండాలనుకున్నా. నన్ను పాత్రల కోసం సంప్రదించిన దర్శకులకు ముందే దీని గురించి చెప్పేవాడిని.

గాఢమైన సన్నివేశాలు ఏవైనా ఉంటే తాను సినిమా చేయలేనని.. మీరు వేరే వాళ్లను ప్రయత్నించవచ్చని మర్యాదపూర్వకంగానే చెప్పేవాడిని. కేవలం ఈ కారణంతోనే నేను చాలా సినిమాలు వదులుకున్నాను. ఐతే ఈ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు’’ అని అభిషేక్ స్పష్టం చేశాడు. ఈ మధ్య అభిషేక్ కెరీర్ బాగా నెమ్మదించగా.. అతను ‘బ్రీత్-2’ అనే వెబ్ సిరీస్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Next Story