విష ప్రచారాలు ఆపండి.. పరువు నష్టం దావా వేస్తా.. ఏబీ తనయుడు

By అంజి  Published on  11 Feb 2020 4:03 AM GMT
విష ప్రచారాలు ఆపండి.. పరువు నష్టం దావా వేస్తా.. ఏబీ తనయుడు

అమరావతి: తనపై వస్తోన్న ఆరోపణలను ఏబీ వెంకటేశ్వరరావు తనయుడు చేతన్‌ సాయికృష్ణ ఖండించారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి తాను ఏ టెండర్లలలో పాల్గొనలేదని తెలిపారు. ప్రభుత్వం చేసిన అభియోగాలతో తనకు ఏ విధమైన సంబంధం లేదన్నారు. తాను చేసినది ప్రైవేట్‌ స్టార్టప్‌లు తప్ప.. ఏ ప్రభుత్వానికి చెందిన టెండర్లలో పాల్గొనలేదని చేతన్‌ సాయికృష్ణ అన్నారు. నా త తండ్రి బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగి, ఆయన కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ఈ ప్రకటన ఇస్తున్నాను అంటూ సాయికృష్ణ వివరించారు. ఇకనైనా తనపై చేస్తోన విష ప్రయోగాలు ఆపాలన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేయడం తప్ప వేరే మార్గాలు లేవని పత్రికా ప్రకటనలో ఏబీ వెంకటేశ్వరరావు తనయుడు చేతన్‌ సాయికృష్ణ తెలిపారు.

ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును వైసీపీ ప్రభుత్వం ఇటీవలే సస్పెండ్‌ చేసింది. చంద్రబాబు హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటన వెలువరించింది. టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు పని చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్‌ సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇజ్రాయెల్‌ సంస్థతో కుమ్మక్కైన ఏబీవీ.. తన కుమారుడు చేతన్‌ సాయికృష్ణ సంస్థకు కాంట్రాక్ట్‌ ఇప్పించాడని ప్రభుత్వం ఆరోపణలు చేసింది. విదేశీ సంస్థతో కుమ్మక్కై కాంట్రాక్ట్‌ ఇప్పించుకోవడం అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘనే అని ప్రభుత్వం అంటోంది. విదేశీ సంస్థతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ప్రభుత్వం ఆరోపణ చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఇంటెలిజెన్స్‌ ప్రోటోకాల్స్‌, విధానాలను బహిర్గతం చేశారని ప్రభుత్వం అంటోంది.

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్సన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా స్పందించారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించినందుకు కారణమైన వెంకటేశ్వరరావును సన్మానిస్తారని అనుకొంటే.. సస్పెండ్ చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి, వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఏబీ వెంకటేశ్వరరావు కారణం అని కేశినేని నాని ట్వీట్ చేశారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను భుజాలపైన ఎక్కించుకొని మోయటమే పార్టీ విధానం అయితే నేను ఖచ్చితంగా ఆ విధానానికి వ్యతిరేకమే అంటూ ఎంపీ కేశినేని నాని ట్వీట్‌ చేశారు.



కేశినేని ట్వీట్‌పై వైసీపీ నేత పీవీపీ స్పందించారు. ఎంపీ గారు అవినీతిపై, మీ పార్టీ విధానాలపై విరుచుపడుతున్నందుకు హ్యాట్సాఫ్‌ అంటూ ట్వీట్‌ చేశారు.



Next Story