అమరావతి: ఏబీ వెంకటేశ్వర రావు.. 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యురో చీఫ్‌గా తన అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తన మీద వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. బంధుమిత్రులను హితులను ఉద్దేశించి ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కబురు మీ వరకూ చేరే ఉంటుంది. మీడియాలో వస్తున్న కథనాలతో వాస్తవం లేదని మీ అందరికీ తెలియజెప్పడం ఈ ప్రకటన ఉద్దేశం అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల వలన మానసికంగా తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని.. దానికి మీరెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన అన్నారు. ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్ట పరంగా నాకున్న అవకాశాలను పరిశీలిస్తున్నానని.. తర్వాత తీసుకోబోయే చర్య ఏమిటనేది మీకే త్వరలో తెలుస్తుందని ఆయన అన్నారు.

ఏబీ వెంకటేశ్వర రావు పోస్టింగ్‌లో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఓ సంస్థకు సెక్యూరిటీ పరికరాలను తయారు చేసే కాంట్రాక్టు పనులను ఇప్పించారన్న ఆరోపణలు నిజమేనని తేలడంతో.. ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేస్తున్న ఆయన్ను ఎన్నికల సంఘం ఆదేశాలతో అప్పట్లో బదిలీ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు చాలా కాలం పాటు పోస్టింగ్ దక్కలేదు. తాజాగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్సన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా స్పందించారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించినందుకు కారణమైన వెంకటేశ్వరరావును సన్మానిస్తారని అనుకొంటే.. సస్పెండ్ చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి, వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఏబీ వెంకటేశ్వరరావు కారణం అని కేశినేని నాని ట్వీట్ చేశారు. టీడీపీ నేత వార్ల రామయ్య మాట్లాడుతూ.. ఇవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతీకార రాజకీయాలు అని ఆరోపించారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.