బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్(23) తాజాగా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. తాను 14ఏళ్ల వయసులో ఉన్నప్పుడు లైంగిక దాడికి గురయ్యాయని.. తనపై ఆ దాడికి పాల్పడింది బాగా తెలిసిన వ్యక్తేనని తెలిపింది. ఐరా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో దాదాపు పది నిముషాల నిడివి గల వీడియోలో పోస్టు చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఐరా వీడియో ప్రకారం.. నాకు 14ఏళ్లు ఉన్నప్పుడు నాపై లైంగిక దాడి జరిగింది. ఆ వయసులో నాకు అది అర్థం కాలేదు. ఏడాది అనంతరం అసలు విషయం అర్థమై మా తల్లిదండ్రులకు వెంటనే ఈమెయిల్ పెట్టాను. వారి సహాయంతో ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాను. ఆ ఘటన గురించి ఇప్పుడు ఆలోచన లేదు కానీ.. నాకు తెలియకుండా అయినా సరే, అలా జరగనిచ్చినందుకు గతంలో అప్పుడప్పుడూ నన్ను నేను కొట్టుకునేదానిని. ప్రస్తుతం ఆ ఘటన తాలూకు జ్ఞాపకాల్ని వదిలేసి జీవితంలో ముందుకు సాగుతున్నానని ఐరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పది నిముషాల నిడివి గల వీడియోలో తెలిపారు.
ఇదిలావుంటే.. తాను నైరాశ్యంతో పోరాడుతున్నానని నెల రోజుల క్రితం ఐరా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమీర్‌ఖాన్, ఆయన మొదటి భార్య రీనా దత్తాలకు 1997లో ఐరా జన్మించారు.