సూర్య సెన్సేషన్‌కు రెడీ అయిపోయాడా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Aug 2020 12:47 PM IST
సూర్య సెన్సేషన్‌కు రెడీ అయిపోయాడా?

సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూర్య ఒకడు. ఈ మధ్య తన స్థాయికి తగ్గ విజయాలు లేక కొంచెం వెనుకబడిపోయాడు కానీ.. అంతకుముందు అయితే సూర్య జోరే వేరుగా ఉండేది. అతడి సినిమా వస్తుంటే తెలుగు ప్రేక్షకులు సైతం మన స్టార్ హీరోల సినిమాల తరహాలో ఆసక్తిని ప్రదర్శించేవాళ్లు. మంచి సినిమా పడితే ఇప్పటికీ సూర్య సత్తా ఏంటో చూపిస్తాడు. ‘గురు’ దర్శకురాలైన తెలుగమ్మాయి సుధ కొంగర డైరెక్షన్లో సూర్య నటిస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ అలాంటి సినిమానే అవుతుందన్న ఆశతో అభిమానులు ఉన్నారు. కరోనా లేకపోయి ఉంటే ఈపాటికి ఎప్పుడో ఈ చిత్రం విడుదలయ్యేది. వేసవిలో ప్రేక్షకుల్ని అలరించేది.

కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామా అని సూర్య అండ్ టీం ఎదురు చూస్తోంది. కానీ ఆ అవకాశం ఇప్పుడిప్పుడే వచ్చేలా లేదు. ఐతే సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదని తెలిసినా.. ఈ చిత్రానికి ఇప్పుడే సెన్సార్ చేయించేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతే కాదు.. రిలీజింగ్ సూన్ అంటూ తమిళ పీఆర్వోలు సోషల్ మీడియాలో అప్ డేట్లు కూడా ఇస్తున్నారు.

దీన్ని బట్టి ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేస్తారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. సూర్య భార్య జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రాన్ని ఇలాగే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు థియేటర్ల యాజమాన్యాల నుంచి వ్యతిరేకత వచ్చినా సూర్య పట్టించుకోలేదు. నా సినిమా నా ఇష్టం అన్నాడు. ఇప్పుడు తన చిత్రాన్ని కూడా అలాగే విడుదల చేసేస్తాడేమో అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. అదే నిజమైతే సౌత్ ఇండియాలో ఓటీటీలో రిలీజవుతున్న తొలి భారీ చిత్రంగా ‘ఆకాశమే నీ హద్దురా’ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.

Next Story