హెయిర్ కట్ చేయించుకోవాలంటే ఆధార్ కావాలట
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2020 4:49 PM ISTహెయిర్ కట్ చేయించుకోవాలని అనుకుంటున్నారా.. అయితే మీ ఆధార్ కార్డును తీసుకుని వెళ్లండి. అదేంటీ హెయిర్ కట్‌కు ఆధార్‌కు ఎందుకు అని అంటారా..? ఇక పై హెయిర్ కట్ వెళ్లినప్పుడు ఆ షాపు యజమానికి డబ్బులతో పాటు మీ ఆధార్ వివరాలు ఇవ్వాల్సిందే. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అదీ మన రాష్ట్రంలో కాదులెండి తమిళనాడు రాష్ట్రంలో.
ప్రభుత్వ పథకాలు, టీవీ కనెక్షన్ వంటి పొందడానికి ఆధార్ తప్పని సరి అని అందరికి తెలిసిందే. తమిళనాడు ప్రజలు ఇక పై కటింగ్ చేయించుకోవాలన్న మీ వెంట ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిందే. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌లో తాజాగా భారీ సడలింపులు ఇచ్చారు. ఈ క్రమంలో సెలూన్ షాపులను తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు. కాగా.. సెలూన్ షాపుకు వచ్చే వారి వివరాలను సేకరించాలని షాపు యజమానులను ప్రభుత్వం ఆదేశించింది.
షాపులో ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నంబరు రిజిస్టర్ చేసిన తర్వాతనే కటింగ్ చేయాలని తెలిపింది. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం సెలూన్లు, బ్యూటీపార్లర్లు, స్పాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు, స్పాలకు వచ్చే ఖాతాదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లను తీసుకోవాలని ఆదేశించింది. 50శాతం ఉద్యోగులతోనే షాపులను నిర్వహించాలని భౌతిక దూరం తప్పని సరి అని, ఏసీలని వాడకూడదని నిబంధనల్లో పేర్కొంది.