కేరళలో దారుణం.. 75 సంవత్సరాల వృద్ధురాలిని వదలని కామాంధులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Aug 2020 6:32 AM GMT
కేరళలో దారుణం.. 75 సంవత్సరాల వృద్ధురాలిని వదలని కామాంధులు..!

ఎర్నాకులం: కేరళలో దారుణం చోటుచేసుకుంది. ఎర్నాకులం రూరల్ ప్రాంతంలో ఆదివారం నాడు 75 సంవత్సరాల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మీద దాడికి కూడా పాల్పడ్డారు. ప్రస్తుతం ఆమె ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతోంది.. ఆ వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగైందని ఆసుపత్రి సిబ్బంది తెలిపింది.

'ఆ మహిళ ఆరోగ్యం కొంచెం కొంచెం మెరుగవుతోంది. సాధారణ స్థితికి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె మెంటల్ స్టేట్ కూడా కొంచెం కొంచెం మెరుగవుతోంది' అంటూ ఆమె గురించి ఆసుపత్రి వర్గాలు మెడికల్ బులిటెన్ ను విడుదల చేశాయి.

ఈ ఘటనతో సంబంధం ఉందన్న అనుమానాలతో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 66 సంవత్సరాల మహిళ కూడా ఉంది. నిందితులకు చెందిన ఇంట్లోనే వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు బాగా తాగి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. అంతేకాకుండా ఆమెను లైంగికంగా వేధించారని రూరల్ ఎర్నాకులం పోలీసు ఛీఫ్ కె.కార్తిక్ తెలిపారు. ఆదివారం నాడు రాత్రి సమయంలో బాధితురాలిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఆమెను వైద్యులు పూర్తిగా పరీక్షించి చూడగా.. ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాలు అయినట్లు గుర్తించారు. కడుపు, ఎద భాగంలో కూడా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని గుర్తించారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

వృద్ధురాలిపై పైశాచికంగా దాడి చేసి గాయపరిచిన వారిని వదలకూడదంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

Next Story