ఫ్లైట్ జర్నీ చేసిన ఐదేళ్ల అబ్బాయి.. మీడియా దెబ్బకు సెలబ్రిటీ అయ్యాడు

By సుభాష్  Published on  26 May 2020 10:07 AM GMT
ఫ్లైట్ జర్నీ చేసిన ఐదేళ్ల అబ్బాయి.. మీడియా దెబ్బకు సెలబ్రిటీ అయ్యాడు

ఐదేళ్ల బాలుడు ఒంటరిగా ఫ్లైట్ జర్నీ? ఎందుకలా చేయాల్సి వచ్చింది?

సుదీర్ఘ లాక్ డౌన్ విరామం తర్వాత దేశీయంగా విమానాలు ఎగిరాయి. కాకుంటే.. తీవ్ర గందరగోళం మధ్య. ముందుగా ప్రకటించిన సర్వీసుల్ని ఎడాపెడా రద్దు చేస్తూ తీసుకున్న విమానయాన సంస్థల నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెట్టేశారు. తొలిరోజున దేశ వ్యాప్తంగా 630 సర్వీసుల్ని రద్దు చేయటంతో పలు విమానాశ్రయాల్లో రచ్చ రచ్చగా మారింది ఎన్నో ఆశలతో తమ ప్రయాణం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన పలువురు ప్రయాణికులు.. తాము ప్రయాణించాల్సిన విమానాల్ని ఎందుకు రద్దు చేశారన్న విషయం తెలిసినంతనే ఆవేశం ఉప్పొంగింది. మీరేం చేస్తారో తెలీదు.. మమ్మల్ని పంపాల్సిందేనంటూ రచ్చ చేశారు. దేశీయంగా విమాన ప్రయాణాలపై కొన్ని రాష్ట్రాలు అనుసరించిన తీరుపై కేంద్రం గుర్రుగా ఉంది. మొత్తంగా విమానాలు నడిచిన తొలిరోజున 3200 మంది ప్రయాణికులు జర్నీ చేశారు.

విమాన ప్రయాణం ముగిసిన తర్వాత పరీక్షలు జరిపిన అధికారులు.. ఎలాంటి లక్షణాలు లేకుంటే హోం క్వారంటైన్ అవసరం లేదని తేల్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో దిగిని ఫ్లైట్లలో తొలి ప్రయాణికుల్ని స్థానిక మీడియాలు ఫోకస్ చేయటమే కాదు.. వారిని వార్తల్లో వ్యక్తులుగా మార్చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే..ఢిల్లీ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ఐదేళ్ల బాలుడు ఇప్పుడు సెలబ్రిటీగా మారాడు.

దేశ రాజధాని నుంచి బెంగళూరుకు ఒంటరిగా.. స్పెషల్ కేటగిరీ ప్రయాణికుడి హోదాలో అతగాడు ప్రయాణించాడు. దీంతో.. మీడియా ఫోకస్ అంతా అతడి మీదే పడింది. ఐదేళ్ల చిన్న వయసులో.. తల్లిదండ్రుల తోడు లేకుండా ఒక్కడే ప్రయాణించిన అతగాడి ధైర్యం ఒక ఎత్తు అయితే.. దాని వెనకున్న కథ తెలిస్తే.. లాక్ డౌన్ లో ఇలాంటి ఉదంతాలెన్నో భావన కలుగక మానదు. ఇంతకీ ఈ చిన్నారి వెనకున్న కథేమిటంటే.. ఆ ఐదేళ్ల పిల్లాడి పేరు విహాన్ శర్మ. తల్లిదండ్రులది బెంగళూరు. లాక్ డౌన్ కు ముందు ఢిల్లీలో ఉన్న తన తాతల దగ్గరకు వెళ్లాడు. రెండున్నర నెలలు అక్కడే ఉండిపోయాడు.

లాక్ డౌన్ సడలింపులో భాగంగా విమాన సర్వీసుల్ని ప్రారంభించిన నేపథ్యంలో స్పెషల్ కేటగిరి ప్రయాణికుల జాబితాలో అతడ్ని ఢిల్లీ నుంచి బెంగళూరుకు పంపారు.

దీంతో.. ఆ చిన్నారి విషయంలో విమానయాన సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించటంతో పాటు.. పలు జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్న వయసు అయినప్పటికీ ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా వ్యవహరించిన పిల్లాడి తీరు అందరిని ఆకర్షించింది. చేతిలో స్పెషల్ కేటగిరా ప్లకార్డు పట్టుకున్న అతడి గురించి మీడియా ఆరా తీయటంలో అతడి ఉదంతం బయటకు వచ్చింది. తమ కుమారుడి కోసం ఎదురుచూస్తున్న నిహాన్ తల్లిదండ్రులు.. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చినంతనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నిత్యం ఫోన్ లో పలుకరిస్తున్నా.. రెండున్నర నెలల పాటు తమకు దూరంగా ఉండిపోవటంతో చాలా ఇబ్బంది పడినట్లుగా విహాన్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. చిన్న వయసులో పిల్లాడు చూపిన స్థైర్యం ఇప్పుడు అతడ్ని సెలబ్రిటీగా మార్చేసింది.

Next Story