5జీ సంబంరం ఓకే.. మీరు వాడే స్మార్ట్ ఫోన్ పని చేస్తుందా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 July 2020 1:20 PM IST
5జీ సంబంరం ఓకే.. మీరు వాడే స్మార్ట్ ఫోన్ పని చేస్తుందా?

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన కంపెనీ సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటన చేయటం తెలిసిందే. దేశంలో 5జీ సేవల్ని అందించేందుకు జియో సిద్ధంగా ఉందని.. వచ్చే ఏడాదికి తాము 5జీ సేవల్ని అందిస్తామని కీలక ప్రకటన చేసింది. అంబానీ నోటి నుంచి ఈ ప్రకటన వచ్చినంతనే అన్ని మీడియా సంస్థలు విశేషమైన ప్రాధాన్యతను ఇచ్చాయి. టాప్ స్టోరీ కింద మార్చేశారు.

ఇప్పటివరకూ దేశంలో 4జీ సేవలు మాత్రమే అందిస్తున్న నేపథ్యంలో.. జియో ప్రకటించిన 5జీ సేవలు ఒక్కసారి అందుబాటులోకి వస్తే ఏం జరుగుతుంది? అంటే.. డేటా స్పీడ్ భారీగా పెరుగుతుంది. 4జీలోనే లైవ్ స్ట్రీమింగ్ అదిరేలా ఉన్న స్థాయి నుంచి మరో స్థాయికి వెళుతుంది. డేటా డౌన్ లోడ్ స్పీడ్ భారీగా పెరిగిపోతుంది. కనురెప్పమాటలో భారీ హెచ్ డీ క్లారిటీ ఉన్న సినిమాల్ని పెద్ద ఎత్తున డౌన్ లోడ్ చేసుకునే సామర్థ్యం వచ్చేస్తుంది.

ఇదంతా బాగుంది.. మరి 5జీ సేవలు రావటానికి ప్రభుత్వం ఓకే అనాలి కదా? అంటారా? 5జీ స్పెక్ట్రాం అమ్మకం ద్వారా భారీ ఎత్తున ఆదాయం వచ్చే వీలున్న నేపథ్యంలో ప్రభుత్వానికి దాన్ని అమ్మటానికి ఉండే ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు.

సో.. టెక్నాలజీ అందించేందుకు జియో సిద్ధం.. దానికి అవసరమైన అనుమతులు ఇవ్వటానికి కేంద్రం ఓకే అనుకుంటే.. ప్రజలకు కలిగే ఇబ్బంది ఒక్కటే. ఇప్పుడు వాడుతున్న స్మార్ట్ ఫోన్లు ఏవీ పనికి రావు. ఇప్పుడు వాడే ప్రతిఫోన్ 4జీ సేవల్ని వినియోగించే వరకే ఉన్నాయి. 5జీ సేవల్ని వినియోగించుకునేందుకు వీలుగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. 5జీ సేవలు అందుబాటులోకి రాగానే సరికాదు. అందుకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్లను అప్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ కారణంతోనే గూగుల్.. జియోతో చేతులు కలిపింది. పెద్ద ఎత్తున అండ్రాయిడ్ ఫోన్లను చౌకగా అమ్మే ఆలోచనను తెర మీదకు తీసుకురానుంది. అదే జరిగితే.. మొబైల్ ఫోన్ల వ్యాపారంలోనూ జియోను కొట్టే వారే ఉండరు. మరీ.. 5జీ ప్లాన్ జియోకు ఏ మేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి.

Next Story