'జూమ్' కు పోటీగా వీడియో కాలింగ్ యాప్ తెచ్చిన జియో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2020 2:20 AM GMT
జూమ్ కు పోటీగా వీడియో కాలింగ్ యాప్ తెచ్చిన జియో

ప్రస్తుతం వీడియో కాల్స్ విషయంలో జూమ్ యాప్ ను ఎక్కువగా వాడుతున్నారు. ఇలాంటి సమయంలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 'జియో మీట్ వీడియో కాలింగ్ యాప్' ను తీసుకుని వచ్చింది. ఈ JioMeet యాప్ ద్వారా అన్ లిమిటెడ్ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. జూమ్ యాప్ కు ప్రత్యమ్నాయంగా ఈ యాప్ ను జియో మార్కెట్ లోకి తీసుకుని వచ్చింది.

జియో మీట్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మాక్ ఓఎస్ లో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం జియో మీట్ యాప్ హెచ్డీ ఆడియో, వీడియోను సపోర్ట్ చేస్తుంది. 100 మంది పార్టిసిపెంట్స్ వరకూ స్క్రీన్ షేరింగ్ చేసుకోవచ్చు. మీటింగ్ షెడ్యూల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. జూమ్ లాగా 40 నిమిషాల టైమ్ లిమిట్ ఇందులో లేదు.. 24 గంటల పాటూ విరామం లేకుండా ఆన్ లైన్ మీటింగ్స్ జరుపుకోవచ్చని సంస్థ తెలిపింది. జూమ్ లో కొన్ని ఫీచర్స్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని.. జియో ఉచితంగా అందిస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

జియోమీట్ యాప్ లో సైనప్ అవ్వడం కూడా చాలా ఈజీ అని సంస్థ తెలిపింది. మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీని ఉపయోగించి వెంటనే మీటింగ్ లోకి లాగిన్ అవ్వొచ్చు. జియో మీట్ లో అన్ లిమిటెడ్ మీటింగ్స్ ప్రతి రోజూ నిర్వహించవచ్చు. ప్రతి ఒక్క మీటింగ్ కూడా పాస్ వర్డ్ ప్రొటెక్ట్ అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్ ను భారత్ లో బ్యాన్ చేయడంతో దేశీ యాప్స్ కోసం భారతీయులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మీటింగ్స్ కోసం జియోమీట్ ను తీసుకురావడంతో జూమ్ కు షాక్ ఇచ్చినట్లే..! ఇప్పటికే లక్షల్లో ఈ యాప్ ను ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకుంటూ ఉన్నారు.

జియో మీట్ యాప్ ద్వారా ఒక డివైజ్ నుండి మరో డివైజ్ కు కాల్ నుండి డ్రాప్ అవ్వకుండా కొనసాగించవచ్చు. జూమ్ యాప్ కేవలం ఈ-మెయిల్ ఐడీ ద్వారా మాత్రమే సైన్ అప్ చేసుకునే అవకాశం ఉండగా.. జియో మీట్ లో ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ రెండూ ఉన్నాయి. జూమ్ కంటే ఎన్నో మంచి ఫీచర్స్ జియో మీట్ లో ఉన్నట్లు రివ్యూలు కూడా ఇస్తున్నారు.

Next Story