దశాబ్దకాలపు సూర్యుడు.. వీడియో విడుదల చేసిన నాసా.. వైరల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jun 2020 11:35 AM GMT
దశాబ్దకాలపు సూర్యుడు.. వీడియో విడుదల చేసిన నాసా.. వైరల్

అంతరిక్ష కేంద్రం నాసా ( నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌) సూర్యుడికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియోను విడుదల చేసింది. పది సంవత్సరాల క్రితం సూర్యుడు.. ప్రస్తుతం సూర్యుడు ఎలా ఉన్నాడో కళ్లకు కట్టినట్లు చూపిస్తూ గంట నిడివి గల వీడియోను ‘ఏ డెకేడ్ ఆఫ్ సన్’ అనే పేరుతో విడుదల చేసింది. సోలార్ డైన‌మిక్స్ అబ్జ‌ర్వేట‌రీ పది సంవత్సరాలుగా సూర్యుడి ప్రతి కదలికను రికార్డ్ చేసింది. అలా పది సంవత్సరాలలో 425 మిలియ‌న్ల హై రెజ‌ల్యూష‌న్ ఫోటోల‌ను సోలార్ డైన‌మిక్స్ అబ్జ‌ర్వేట‌రీ సేకరించింది.

ఆ మొత్తం ఫొటోలను కలిపి.. ప్రతి గంటకు ఒక ఫొటోను జత చేస్తూ.. మొత్తం పది సంవత్సరాల కాలాన్ని ఒక గంట ఒక నిమిషం(61 నిమిషాలలో)లో బంధించారు. సూర్యునికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలు, చోటు చేసుకున్న మార్పులను ఓ క్రమానుసారంగా వీడియోలో పొందుపరిచారు. పదేళ్లలో ఈ ఫొటోలను తీయటానికి దాదాపు 20 మిలియన్‌ గిగాబైట్ల డేటా ఖర్చయింది. ఈ వీడియోలో సూర్యుడిపై భారీ మంటలు, సూర్యకంపాలు, సౌరగాలులు ఇలా ఎన్నో కనిపిస్తున్నాయి. ఇందులో సూర్యగ్రహణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇ‍ప్పటి వరకు 7.7లక్షల వ్యూస్‌ను 8,600 లైక్స్‌ను సంపాదించుకుంది.

Next Story