360డిగ్రీస్ పర్సనాలిటీ పీవీ.. కేసీఆర్
By తోట వంశీ కుమార్ Published on 28 Jun 2020 7:29 AM GMTబహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప సంస్కరణ శీలి, 360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు అని.. ఆయన లాంటి వ్యక్తి తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వంగా ఉందని అన్నారు సీఎం కేసీఆర్ అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కేశవరావు, బొంతురామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పీవీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. పీవీ నరసింహరావు నిరంతర సంస్కరణశీలి. సంస్కరణాభిలాషికి నిలువెత్తు నిదర్శం. తన ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించి సంస్కరణ శీలిగా నిలిచారన్నారు. పీవీ నరసింహారావు గురించి చెప్పడానికి కొంత సాహసం కావాలని, ఒక్క మాటలో చెప్పాలంటే 360 డిగ్రీస్ పర్సనాలిటీ పీవీ నరసింహారావు అని కొనియాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. గురుకుల పాఠశాలలను తీసుకొచ్చింది పీవీనే అని, ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చిన నేత పీవీ నరసింహరావని.. మన పీవీ మన తెలంగాణ ఠీవీ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. 14 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగే గొప్ప వ్యక్తి పీవీ. ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకెళ్లాలని కేసీఆర్ సూచించారు. పీవీ ఆశయాల మేరకు రాష్ట్రంలో 900గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు. నెహ్రూకు సమాంతర వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ అని వెల్లడించారు.
పీవీ శత జయంతి ఉత్సవాలు 51 దేశాల్లో జరుగుతున్నట్లు సీఎం తెలిపారు. పీవీ శత జయంతి ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. పీవీకి చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారని.. ఉత్సవ కమిటీలో తాము కూడా ఉంటామని విదేశాల నుంచి ఆసక్తి చూపుతున్నారన్నారు.