ప్రైవేటుపై వేటు తప్పదా? కేసీఆర్ నిర్ణయం ఏమిటి?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Jun 2020 8:51 AM GMT
ప్రైవేటుపై వేటు తప్పదా? కేసీఆర్ నిర్ణయం ఏమిటి?

అనుమానాలు నిజమయ్యాయి. సందేహాలు స్పష్టమయ్యాయి. మాయదారి రోగాన్ని నిర్దారణ చేసే ప్రైవేటు ల్యాబుల్లో ఇష్టారాజ్యం నడిచిందని.. కనీస ప్రమాణాలు పాటించలేదన్న విమర్శలకు బలం చేకూరేలా తాజాగా నియమించిన కమిటీ నివేదిక బయటకు వచ్చింది. ఇందులో ప్రైవేటు ల్యాబుల ప‌నితీరుతో పాటు.. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారన్న వివరాల్ని ఓపెన్ గా పేర్కొన్నారు.

ఐసీఎంఆర్ అనుమతి పొందిన ల్యాబుల్లో ఇన్ని తప్పులు జరిగినట్లుగా నివేదిక చెబుతున్న నేపథ్యంలో.. మరింతగా తనిఖీలు నిర్వహించాలన్ననిర్ణయాన్ని తీసుకున్నారు. అదే సమయంలో సర్కారుకు తలనొప్పిని తీసుకొచ్చిన రీతిలో రిపోర్టులు ఇవ్టంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా వరుసతప్పులు చేస్తున్న ప్రైవేటు ల్యాబుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సహిస్తారా? అన్నది ప్రశ్న.

ఇటీవల కాలంలో నిర్దారణ పరీక్షలు ఇష్టారాజ్యంగా జరపటమే కాదు.. తీసుకున్న శాంపిల్స్ వివరాల్ని సరిగా వెల్లడించలేదు. దీంతో.. పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా వచ్చాయన్న భావనకు కారణమైంది. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా ప్రైవేటు ల్యాబుల తీరు ఉండటాన్ని సీఎం కేసీఆర్ ఎలా తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ప్రైవేటు ల్యాబుల తీరు ఆధారాలతో రిపోర్టు వచ్చిన నేపథ్యంలో వేటు తప్పదన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. అదో సంచలనంగా మారుతుందని చెప్పక తప్పదు.

Next Story