దాసరి ఇంట్లో భగ్గుమంటున్న ఆస్తి వివాదాలు

By సుభాష్  Published on  27 Jun 2020 7:49 AM GMT
దాసరి ఇంట్లో భగ్గుమంటున్న ఆస్తి వివాదాలు

దివంగత దిగ్గజం దాసరి నారాయణరావు ఇంట్లో ఆస్తి వివాదాలు భగ్గుమంటున్నాయి. దాసరి కుమారులైన ప్రభు, అరుణ్‌ల మధ్య ఆస్తుల గొడవ పెరిగిపోతోంది. అయితే ఇటీవల దాసరి అరుణ్‌ రాత్రి సమయంలో తన ఇంటిగోడ దూకి వచ్చి , మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడని దాసరి ప్రభు జూబ్లీ హిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాసరి కుటుంబం ఇలా పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లడం సినీ ఇండస్ట్రీలో హట్‌టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీలో పెద్దదిక్కుగా ఉండే దాసరి నారాయణరావు.. ఒకప్పుడు ఎన్నో వివాదాలను పరిష్కరించిన కుటుంబమే ఇలా రోడ్డుపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగింది..

ఈనెల 24న రాత్రి పది గంటల సమయంలో దాసరి అరుణ్‌ కుమార్‌, అతని కారు డ్రైవర్‌ ఆయన ఇంట్లో చొరబడ్డారు. మద్యం మత్తులో ప్రభు తీవ్ర దుర్భాషలాడుతూ దాడికి దిగారు. ఇంట్లో ఉన్న దాసరి నారాయణరావు బీరువాను ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నించగా, అడ్డుకున్నందుకు తనతో పాటు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్లు ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక ప్రభు, అరుణ్‌లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ ఇంట్లోకి అక్రమంగా అరుణ్‌ ప్రవేశించి దాడికి పాల్పడ్డాడని ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అది పెద్దదిగా మారింది. అయితే దీనిపై తారుణ్‌ మాట్లాడుతూ..ఎస్సై సమక్షంలోనే నేను ఇంట్లోకి వెళ్లాను.. గేటు దూకిన సమయంలో మద్యం తాగలేదు. నా ఇంటి గేటు నేను దూకితే తప్పింటి అని అంటున్నారు. ఆ ఇల్లు ఏ ఒక్కరిది కాదని, ముగ్గురిదన్నారు. వీలునామా ఉంటే కోర్టుకు చూపించాలని అన్నారు. సోదరుడు ప్రభు చెప్పేవన్ని అబద్దాలేనని, లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని, ఆధారాలుంటే చూపించాలని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో సినీ పెద్దలు జోక్యం చేసుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నాడు.

ఆ ఇల్లు నా కూతురుకే చెందుతుంది: దాసరి ప్రభు

తమ ఇంట్లోకి అక్రమంగా అరుణ్ ప్రవేశించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రభు.. ఇంట్లో చొరబడ్డ సమయంలో గేటు బయట మరికొందరున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్తి కోసమే నన్ను వేధిస్తున్నాడని, చంపుతానని కూడా బెదిరిస్తున్నాడని ఆరోపించారు. అరుణ్‌ వెనుక కొందరు పెద్దమనుషులు ఉన్నారని, ఆ ధైర్యంతోనే తనపై దాడికి దిగాడని ఆరోపించాడు. దాసరి తన ఇంటిని మనవరాలి (ప్రభు కూతురు) పేరుపై రాశారని, వీలునామా ప్రకారం ఆ ఇల్లు తన కూతురుకే దక్కుతుందని ప్రభు పేర్కొన్నారు.

పెద్దలు జోక్యం చేసుకోవాలి

బతికున్నప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సమస్యలను పరిష్కరించిన దాసరి నారాయణరావు కుటుంబంలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకోవడంపై ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో సాన్నిహితంగా ఉన్న పెద్దలు జోక్యం చేసుకొని వివాదం సద్దుమణిగేలా చూడాలని అంటున్నారు. వివాదం మరింత ముదిరితే దాసరి ప్రతిష్టకు భంగం కలుగుతుందని అంటున్నారు.

Next Story