కేరళలో 34 'హైటెక్' స్కూళ్లను ప్రారంభించిన కేర‌ళ సీఎం విజయన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Sep 2020 10:25 AM GMT
కేరళలో 34 హైటెక్ స్కూళ్లను ప్రారంభించిన కేర‌ళ సీఎం విజయన్

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు సరిగా ఉండవన్న కారణంతో ఎక్కువమంది ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివించేందుకు మొగ్గు చూపుతుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నప్పటికీ...అప్పు సప్పు చేసైనా ప్రైవేటు విద్యాసంస్థలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. తాజాగా కేరళ సీఎం పినరాయి విజయన్ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు.

కేరళలో కొత్తగా నిర్మించిన అధునాతన పాఠశాలలను విజయన్ ప్రారంభించారు. కోజికోడ్, కన్నూర్, ఇడుక్కి, కొట్టాయం, తిరువనంతపురం, కొల్లాం, ఎర్నాకులమ్, త్రిస్సూర్, అలపుంజా, మలప్పురంలలో నియోజకవర్గాలలో మొత్తం 34 స్కూళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయన్ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేరళ సర్కార్ చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ అధునాతన హైయ్యర్ సెకండరీ గ్రేడ్ స్కూళ్లు నిర్మించారు.

ఈ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా హైటెక్ క్లాస్ రూములు, కిచెన్, డైనింగ్ హాల్, సైన్స్, కంప్యూటర్ లేబొరేటరీలు ఉన్నాయి. గతంలో 22 పాఠశాలలను(రూ.5 కోట్ల వ్యయం కేటగిరీలో) నిర్మించిన విజయన్ సర్కార్...మరో 14 పాఠశాలలను నిర్మిస్తోంది.గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో విజయన్ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కేరళ సర్కార్ రూ.3129 కోట్లను కేటాయించింది.

ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 250 కొత్త పాఠశాల భవనాలను అధునాతన, మౌలిక సదుపాయాలతో నిర్మించే కార్యక్రమానికి గతంలోనే శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉన్న 350 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగించనున్నారు. కేరళ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ బోర్డు ఆధ్వర్యంతో ఈ మొత్తాన్ని ఖర్చు పెడుతున్నారు. 141 స్కూళ్లకు రూ.5 కోట్లు, 395 స్కూళ్లకు రూ.3 కోట్లు, 446 స్కూళ్లకు రూ.1కోటి కేటాయించారు. ఈ స్కూళ్ల నిర్మాణాలపై విపక్షాలు చేసే విష ప్రచారం నమ్మవద్దని విజయన్ అన్నారు.

Next Story
Share it