విజయవాడ: 300 మందిని క్వారంటైన్‌కు తరలింపు

By సుభాష్  Published on  26 April 2020 3:19 PM IST
విజయవాడ: 300 మందిని క్వారంటైన్‌కు తరలింపు

విజయవాడలో మూడు రోజుల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇన్నటి వరకు 18 కేసులు నమోదు కాగా, ఆదివారం ఒక్క రోజు 20 కేసుల వరకు నమోదయ్యాయి. దీంతో కృష్ణలంకను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఆయనతో కాంటాక్ట్‌ అయిన 18 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇక విజయవాడ కృష్ణలంక నుంచి 300 మందిని క్వారంటైన్‌కు తరలించారు. దీంతో లారీ డ్రైవర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. విజయవాడలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు.

కృష్ణలంక, కార్మిక నగర్‌, ఖుద్దూస్‌ నగరర్‌ ప్రాంతాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఆ ప్రాంతాల్లో సామూహిక సమావేశాలు ఏర్పాటు చేయడం కారణంగా కరోనా వ్యాప్తి మరింత పెరిగిందని తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకూ 7,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 170 మందికి పాజిటివ్‌ వచ్చింది.

ఇక తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్త‌గా మ‌రో 81 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 1097 కి చేరింది. ఇప్పటి వరకూ 31 మంది మరణించగా, 231 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 835 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అయితే ఇప్పటి వరకూ కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా కృష్ణా జిల్లాలో 52 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. ప‌శ్చిమ‌ గోదావ‌రి 12, క‌డ‌ప 3, అనంత‌ర‌పురం 2, తూర్పుగోదావ‌రి 2, గుంటూరు 3, ప్ర‌కాశంలో 3 కేసులు న‌మోద‌య్యాయి. ఇక రాష్ట్రంలో అత్య‌ధికంగా ఇప్ప‌టి వ‌ర‌కు కర్నూలు జిల్లాలో 279 కేసులు, గుంటూరు 214, కృష్ణా జిల్లాలో 177 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

Next Story