ఒకే కుటుంబంలో 26మందికి క‌రోనా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Jun 2020 12:39 PM GMT
ఒకే కుటుంబంలో 26మందికి క‌రోనా..

క‌రోనా.. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌నాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మ‌హ‌మ్మారి. అయితే భార‌త్‌లో కూడా లాక్‌డౌన్ స‌డ‌లింపులు చేసిన ‌నాటినుండి విజృంభిస్తుంది. గ‌త రెండు వారాలుగా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతూ అటు ప్ర‌భుత్వాల‌ను, ఇటు జ‌నాల‌ను కంగారు పెట్టిస్తున్న‌ది. తాజ‌గా రాజస్ధాన్ రాష్ట్రం జైపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

వివ‌రాళ్లోకెళితే.. రాజస్ధాన్ రాష్ట్రం జైపూర్లోని సుభాష్‌ చౌక్‌ ప్రాంతానికి చెందిన ఒక వ్య‌క్తికి ఏడు రోజుల కిందట కోవిడ్‌-19 పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ వ్య‌క్తి కుటుంబంలోని 25 మందికి అధికారులు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వహించారు. వారి నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించగా గత రాత్రే రిపోర్టులు వచ్చాయి. ఆ రిపోర్టుల‌లో కుటుంబంలోని అంద‌రికి పాజిటివ్ అని తేలింది. దీంతో వారందరినీ ఆస్పత్రికి తరలించామని వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నరోత్తమ్‌ శర్మ వెల్లడించారు.

ఇదిలావుంటే.. రాజస్ధాన్ రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న నగరం జైపూర్‌. ఆ తర్వాత కోట, జోథ్‌పూర్‌ నగరాలు కూడా కరోనా హాట్‌స్పాట్‌లుగా మారాయి. ఇక‌ రాజస్ధాన్‌లో ఇప్పటివరకూ 11,020 మంది కరోనా వైరస్ బారిన‌ప‌డ‌గా 7500మందికి పైగా కోలుకున్నారు. ఇక ఇప్ప‌టివ‌ర‌కూ మహమ్మారి బారినపడి రాజ‌స్ధాన్‌లో 251 మంది మరణించారు.

Next Story