కస్టమర్లకు ఆర్‌బీఐ శుభవార్త.. ఇక 24×7 ఆర్టీజీఎస్ సేవలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Oct 2020 8:28 AM GMTభారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) కస్టమర్లకు శుభవార్త ప్రకటించింది. ఇకపై నగదు బదిలీకి సంబంధించిన ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్) సేవల్ని 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇది డిసెంబరు నుంచి అమల్లోకి రానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పనిదినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండగా.. డిసెంబర్ నుంచి 24×7 అందుబాటులోకి రానున్నాయి.
సాధారణంగా ఎవరికైనా డబ్బుల్ని అకౌంట్ ద్వారా పంపడానికి నాలుగు పద్ధతులుంటాయి. అందులో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్(NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(RTGS), ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్(IMPS) ద్వారా డబ్బులు పంపొచ్చు.
యూపీఐలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి లిమిట్ ఉంటుంది. నెఫ్ట్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే సెటిల్మెంట్ పద్ధతిలో అవతలివాళ్ల అకౌంట్‌లోకి వెళ్తాయి. అది కూడా బ్యాంకు పనిచేసే వేళల్లో మాత్రమే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఐఎంపీఎస్ ద్వారా వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇందుకోసం కొంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక భారీ మొత్తంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఆర్టీజీఎస్ ఉపయోగపడుతుంది. ఆర్‌టీజీఎస్ ద్వారా రూ.2 లక్షల నుంచి ఎంతైనా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మిగతా విధానాలతో పోలీస్తూ నగదు బదిలీ వేగంగా జరగడమే వీటి ప్రత్యేకత.