తెలంగాణలో వారం రోజుల్లో వేయికి పైగా కరోనా కేసులు
By తోట వంశీ కుమార్ Published on 11 Jun 2020 9:03 AM ISTతెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజు వందకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. బుధవారం కూడా 191 కేసులు నమోదు కాగా.. 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 4,111కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 156 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,817 మంది డిశ్చార్జి కాగా.. 2,138 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా 143 హైదరాబాద్ పరిధిలోనే నమోదు అయ్యాయి. మేడ్చల్ 11, సంగారెడ్డిలో 11, రంగారెడ్డిలో 8, మహబూబ్ నగర్‌లో 4, జగిత్యాలలో 3, మెదక్‌లో 3, నాగర్‌కర్నూల్‌లో 2, కరీంనగర్‌లో 2, నిజామాబాద్‌లో 1, వికారాబాద్‌లో 1, నల్లగొండలో 1, సిద్దిపేటలో 1 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. లాక్‌డౌన్ సడలింపులతో ప్రజల రాకపోకలు పెరగడంతో వైరస్ వ్యాప్తి చెందిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈనెల 3న తెలంగాణలో కేసులు మూడు వేలు దాటగా.. కేవలం వారం రోజుల్లోనే మరో 1000పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
సామాజిక వ్యాప్తి లేదు..
తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి జరగలేదని ఐసీఎంఆర్ ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో ఇదే వెల్లడైందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జాతీయ పోషకాహార సంస్థ సహకారంతో జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గత నెల 15 నుంచి 17 వరకు సేకరించిన నమూనాల్లో అతి తక్కువ పాజిటివ్‌లు కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శన మన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సమర్థవంతంగా లాక్‌డౌన్ అమలు చేయడం, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్ సర్వే ఫలితాలను విడుదల చేశారు.