రైతు బంధు లబ్థిదారుల్లో ఆ స్థాయి వారు అంతమందా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jun 2020 9:07 AM GMT
రైతు బంధు లబ్థిదారుల్లో ఆ స్థాయి వారు అంతమందా?

వ్యవసాయం చేసే వారంతా రైతులే. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నోళ్లు రైతులే.. పాతిక ఎకరాలున్నోళ్లు రైతులే. కాకుంటే.. చిన్న రైతులు కష్టపడి పంటలు పండిస్తూ.. కిందామీదా పడుతుంటే.. పెద్దఎత్తున భూములు ఉన్న వారు కౌలురైతులకు భూమిని అప్పగిచ్చేస్తుంటారు. అలాంటివారు సైతం రైతుల లెక్క కింద ప్రభుత్వం అందించే రైతుబంధు సాయాన్ని తీసుకుంటున్నారు.

నాలుగు ఎకరాలు.. అంతకంటే ఎక్కువ భూమి ఉన్న వారిని బక్క రైతు కోటాలో వేయలేం. నాలుగు.. అంతకంటే ఎక్కువ ఎకరాలున్న వారు.. రైతుబంధు లెక్కలోకి ఎంతమంది ఇస్తారన్నది చూస్తే.. అంతమందా? అనుకోక తప్పదు. ప్రభుత్వం అందిస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద లబ్థిదారులుగా 54.24లక్షల మందిగా తేల్చారు. వారి అధీనంలో ఉన్న భూమి 1.404లక్షల ఎకరాలు.

ఎకరం నుంచి పదిహేను ఎకరాల కంటే ఎక్కువగా భూములు ఉన్న వారెందరు? వారి అధీనంలో ఉన్న భూమి లెక్కలు చూస్తే.. ఈ పథకం కింద అవసరమైన వారి కంటే.. అనవసరమైన వారికి సైతం పెద్ద ఎత్తున సాయం అందుతుందన్న అభిప్రాయం కలుగక మానదు. ఎకరం లోపు తెలంగాణ రాష్ట్రంలో 17.98లక్షల మంది ఉన్నారు. వారి అధీనంలో 10.38 లక్షల ఎకరాలు ఉన్నాయి. రెండు ఎకరాలు ఉన్న వారు 14.34 లక్షల మంది కాగా.. వారి అధీనంలో ఉన్న భూమి 21.94లక్షలుగా తేల్చారు. మూడు ఎకరాలు ఉన్న వారు 9.32లక్షల మంది కాగా వారి అధీనంలో ఉన్న భూమి 23.42 లక్షల ఎకరాలు. నాలుగు ఎకరాలు ఉన్న రైతుల సంఖ్య 5.91లక్షల మంది కాగా.. వారి వద్ద ఉన్న భూమి 20.7 శాతం. ఐదు ఎకరాలు ఉన్న వారు4.20 లక్షల మంది అయితే.. వారి అధీనంలో ఉన్న భూమి 19.09 లక్షల ఎకరాలు.

ఐదు ఎకరాలకు మించి పది ఎకరాల లోపు భూమి ఉన్న వారు రాష్ట్రంలో 4.45 లక్షల మంది ఉంటే.. వారి అధీనంలో ఉన్న భూమి 29.64 లక్షల ఎకరాలు. పది నుంచి పదిహేను ఎకరాలు ఉన్న వారు 68వేల మంది కాగా.. వారి అధీనంలో 8.12లక్షల ఎకరాలుగా గుర్తించారు. ఇక.. పదిహేను ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న వారు తెలంగాణలో 33416 మంది ఉండగా.. వారి అధీనంలో 7.11లక్షల ఎకరాల భూమి ఉంది.

ఇక.. శాతాల విషయానికి వస్తే.. ఎకరం లోపు ఉన్న వారు 7.39 అయితే.. రెండు ఎకరాల వారు 15.62 శాతం. మూడు ఎకరాలున్న వారు 16.67 శాతం ఉండగా.. నాలుగు ఎకరాలు ఉన్న వారు 14.78 శాతం మంది అయితే.. ఐదు ఎకరాలున్న వారి సంఖ్య 13.5శాతంగా ఉంది. రాష్ట్రంలో కొందరి దగ్గరే అత్యధిక భూమి ఉన్న విషయం ఈ గణాంకాల్ని చూస్తే అర్థమవుతుంది.

తెలంగాణలోని రైతుబంధు పథకం అమలవుతున్న లబ్థిదారుల్లో 29.64లక్షల ఎకరాలు (అంటే.. మొత్తం భూమిలో 21.1 శాతం) 4.45లక్షల మంది చేతిలో ఉండటం చూస్తే.. ఈ పథకం డొల్లతనం అర్థమవుతుంది.సాధారణంగా ఐదు నుంచి పది ఎకరాలు అంటే.. వారి స్థాయి మిగిలిన వారి కంటే ఎక్కువగా ఉంటుందన్నది మర్చిపోకూడదు. రైతుబంధు పథకంలోని లబ్థిదారుల్లో భారీగా భూములు ఉన్నోళ్లు దగ్గర దగ్గర 32 శాతం మంది ఉండటం గమనార్హం. ఇలాంటివారికి ప్రభుత్వ సాయం అందించాల్సిన అవసరం ఉందా? అన్నది ఒక ప్రశ్నగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story