మీడియా చేస్తున్న తప్పులంటూ సీఎం కేసీఆర్‌కు అందిన చిట్టా ఏమంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Jun 2020 7:15 AM GMT
మీడియా చేస్తున్న తప్పులంటూ సీఎం కేసీఆర్‌కు అందిన చిట్టా ఏమంటే?

వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కీలక అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెలతో పాటు.. ఆయన శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో మీడియాలో వస్తున్న రిపోర్టులను ప్రస్తావిస్తూ సీఎం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇలాంటివేళ.. ఈటెల టీం సభ్యులు మీడియా చేస్తున్న తప్పుల చిట్టాను ఏకరువు పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఇంతకీ కేసీఆర్ కు ఈటెల టీం ఏం చెప్పింది? అన్న విషయంలో వ్యాఖ్యానంతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రెస్ నోట్ లోని వివరాల్లోకి సూటిగా వెళ్లిపోతే..

  • దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే వైద్య ఆరోగ్య శాఖ పూర్తి సంసిద్ధంగా ఉంది. 9.61 లక్షల పీపీఈ కిట్లు.. 14 లక్షల ఎన్ 95 మాస్కులు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్స్ మొత్తం 3600.
  • మందులకు ఎలాంటి కొరత లేదు. వైద్యులు.. వైద్య సిబ్బందికి మాయదారి రోగం సోకుతుందన్న ప్రచారం చేసి ఆత్మస్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నాలు సాగుతున్నాయి. (మరి.. మీడియాకు చెందిన వారికి సైతం సోకిన విషయాల్ని రిపోర్టు చేశారు. అలా అని మీడియా స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతున్నట్లా?)
  • వైద్య సేవలు అందించే సిబ్బందికి వైరస్ సోకుతోంది. ఇది చాలా సహజం. ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మందికి పాజిటివ్ వచ్చింది. ఐసీఎంఆర్ అంచనా ప్రకారమే దేశంలో 10వేల మంది వైద్య సిబ్బందికి పాజిటివ్ వచ్చింది.
  • అమెరికాలో 68 వేల మంది.. బ్రిటన్ లో పాజిటివ్ అయిన వారిలో 15 శాతం వైద్య సిబ్బంది ఉన్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ 153 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్ గా తేలింది. వారంతా కోలుకున్నారు.
  • మాయదారిరోగంతో మరణాలు అని చెబుతున్న వాటిల్లో 95 శాతం మంది కేవలం వైరస్ తోనే కాదు.. ఇతర కారణాలతో చనిపోయిన వారున్నారు. కిడ్నీ.. గుండె.. కాలేయం.. శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధ పడేవారు ఉన్నారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో పాటు.. షుగర్.. బీపీ ఉన్న వారు కూడా ఉన్నారు. ఇలా.. ఇతర జబ్బులతో మరణించిన వారిలో పాజిటివ్ ఉన్నోళ్లంతా మాయదారి రోగం కారణంగా మరణించినట్లుగా చెప్పటం అశాస్త్రీయం.
  • కొన్ని మీడియా సంస్థలు.. కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఈ ప్రచారం వెనుక ఏమైనా కుట్ర ఉందన్న అనుమానాలు ఉన్నాయి.
  • గాంధీలో ప్రస్తుతం 247 మంది పాజిటివ్ మాత్రమే ఉన్నారు. వాస్తవ పరిస్థితికి మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఏ మాత్రం పొంతన లేదు.

Next Story
Share it