వార ఫలాలు 16-8-2020 ఆదివారం నుండి 22-8-2020 శనివారం వరకు

By జ్యోత్స్న  Published on  16 Aug 2020 2:24 AM GMT
వార ఫలాలు 16-8-2020 ఆదివారం నుండి 22-8-2020 శనివారం వరకు

ఈ వారం లో వినియోగించుకోవాల్సిన పుణ్యమైన పవిత్రమైన పర్వ దినములు

17-8-2020 సోమవారం మాస శివరాత్రి. సింహ సంక్రాంతి.

18-8-2020 మంగళవారం కృష్ణఅంగారక చతుర్దశి, పోలాల అమావాస్య, పిండ పితృ యజ్ఞం ఇది చాలా ముఖ్యమైన రోజు.

20-8-2020 గురువారం చంద్రోదయం, బలరామ జయంతి, కల్కి జయంతి.

21-8-2020 శుక్రవారం శ్రీవరాహజయంతి.

22-8-2020 శనివారం వినాయక చవితి.

మనం పూజ చేసేటప్పుడు ఇందులో ఏదేవతను ఆరాధించిన మనకు మంచి ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఈ దినాన్ని తెలియజేయటం జరిగింది.

మేష రాశి :- ఈ రాశి వారికి ధన లాభము శత్రు జయము ఆనందాన్ని కలిగిస్తాయి. రాహువు ప్రభావం చేత సర్వసంపదలు ఉన్నాయి, అయితే కుజుడు వ్యయంలోను, 16 వ తేదీ నుండి లగ్నంలోకి వచ్చాక కష్టం విచారం కలిగిస్తున్నాడు. ఈ పరిస్థితుల్ని అధిగమించాలి అనే భావన ఉంటుంది కానీ అందుకు తగిన శక్తి సామర్థ్యములు మీ దగ్గర ఉండవు. ఇది దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. గురుడు శుక్రుడు మంచి అనుకూల మైన ధన లాభం కలిగించే స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల పొందే లాభాలు అనంతం అని చెప్పొచ్చు. రవి, శని, కేతు స్థితి అసలు బాగాలేదు కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త వహించండి. అగౌరవాన్ని, భయాన్ని పొందడం ఇవి రెండూ మీ జాతకంలో ఈ వారంలో ఉంటాయి. ఈ వారం 40 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులను ప్రారంభించకండి. అశ్విని నక్షత్ర జాతకులకు నైధనతార అయింది ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు. కృత్తిక ఒకటో పాదం వారికి మాత్రము ప్రత్యక్తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- సోమవారం మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేసిన, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అర్చన చేయించిన చాలా మంచి ఫలితాలు పొందుతారు అలాగే మంగళవారం నాడు పితృదేవతలకు ప్రీతిగా దానధర్మాలు చేయండి.

వృషభ రాశి :- ఈ రాశి వారికి సంపద ధన ప్రాప్తి శత్రువిజయం భూషణము ఇవన్నీ శుభఫలితాల్ని సూచిస్తున్నాయి. వీరికి కుజుడు 17వ తేదీ నుంచి నష్టాన్ని కలిగించే స్థితిలోకి చేరిపోతాడు. బుధుడు కూడా రెండు రాశులలో సంచారం చేయడంలో రెండు మూడు రోజులు తరువాత విజయాన్ని అందజేస్తాడు. గురుడు ధనవ్యయ కారకుడు అవుతాడు. శుక్రుడు ద్వారా భూషాదుల్ని మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు. రవి సింహ రాశి లోకి ప్రవేశించిన తర్వాత ఉన్న గౌరవం కొద్దిగా తగ్గిపోతుంది . అనారోగ్యాన్ని సూచిస్తుంది కూడా. చాలా విషయాల్లో ఈ వారం వీరికి ప్రతికూలతే చూపిస్తుంది. ఆచితూచి అడుగు వేయడం చాలా అవసరం అంతే కాదు 37 శాతం మాత్రమే వీరికి ఈ వారంలో శుభఫలితాలు కనిపిస్తాయి. ప్రయాణాలకు కొత్త పనులు చేపట్టడానికి ఈ వారంలో అనుకూలత లేదు. కృత్తిక 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మృగశిర 1 2 పాదాలు వారికి విపత్తార అయింది ఇది కూడా ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి.

పరిహారం :- మంగళవారం గణపతికి పూజ చేయించండి. పితృ దేవతా అర్చన చేసిన అమ్మవారి అర్చన చేసిన మంచి ఫలితాలు ఉంటాయి 22-8-2020 శనివారం వినాయక చవితి తప్పకుండా పూజ చేయండి.

మిధున రాశి :- ఈ రాశి వారికి శుభ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ధనలాభము స్వర్ణ ప్రాప్తి ధనసంపాదన అనేక రకాలైన లాభాలు చూస్తారు. కుజ బుధుల మార్పు మీ జాతకానికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే గురుడు గృహ సౌఖ్యం ఇస్తే శుక్రుడు కుటుంబ సౌఖ్యం ఇస్తాడు. ఈ విధంగా మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. అయితే మీకు చంద్రుడు అనారోగ్య హేతువు కారణభూతులు అవుతున్నాడు. బుధుడు కూడా ఓపిక శత్రుపీడ కలిగించే అవకాశం ఉంది. అష్టమ శని మీ రాశి వారికి దుష్ఫలితాలే ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈవారం మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఫలితాలు మీకు కనిపిస్తూ ఉంటాయి అలాగే బంధుమిత్రుల దర్శనాలు కూడా లభిస్తాయి మీకు కూడా ఎక్కువగా ఉంది ఈవారం మీకు 56% శుభఫలితాలు కనిపిస్తాయి. మృగశిర 3 4 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి ఫలితాలు కొంచెం బాగు లేవనే చెప్పాలి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు సమ్పత్తర అయింది. మంచి విశేషాలు కూడా వినే అవకాశం ఉంది. పునర్వసు 1 2 3 పాదాలు వారికి జన్మతార అయింది కాబట్టి అనారోగ్య సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించండి.

పరిహారం :- శనికి జపం చేయడం నువ్వులు దానము దీపదానము ఉప్పు నల్లని వస్త్రం దానాలు చేయించండి. అమ్మవారి పూజ మీకు మంచి ఫలితాలను కూడా కలగజేస్తుంది ముందు రోజున నానవేసిన పెసలు బుధవారంనాడు బెల్లవేసి ఆవుకి తినిపిస్తే చాలా మంచిది.

కర్కాటక రాశి :- ఈ రాశి వారికి ధనలాభము సంతోషము ఉత్సాహము ముందుకు నడిపిస్తాయి. అయితే అనుకున్నంత ఆనందం పొందలేకపోతున్నారు. దీనికి కారణం గ్రహస్థితి ప్రతికూలత ఎక్కువగా ఉంది. చంద్రుడు రెండు రోజులు సహకరిస్తే ఇంకో నాలుగు రోజులు వాయిదా వేస్తాడు. బుధ గురు శుక్రులు కొద్దిపాటి అనుకూలతను కల్పించే అవకాశం అయితే ఉంది కానీ ఎక్కువగా వాయిదా వేయడం జరుగుతుంది శని ఎల్లప్పుడూ కూడా విచారణ కలిగిస్తూ ప్రతి పనికి అడ్డు తగులుతునే ఉంటాడు. చాలా బయట పడకుండా అంతర్మథనం తప్పదు. కొత్త పనికి వెళ్లలేక పాతపనినీ వదులుకొని చిక్కులు ఎదుర్కొంటారు. అనుకున్న పనులు వాయిదా పడుతూనే ఉంటాయి ఆర్ధిక ఇబ్బంది అనారోగ్యంతో ప్రతిరోజూ ఒక ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇబ్బందులు ఇలా ఉంటుందని ఊహించడానికి కూడా అవకాశం ఉండదు. ఈ వారంలో 42 శాతం మాత్రమే శుభఫలితాలు కలిగించేవిగా ఉన్నాయి. పునర్వసు నాలుగో పాదం వారికి జన్మతార అయింది కాబట్టి అనారోగ్య సూచన ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మిత్ర తారైంది కాబట్టి ఫలితాలు చాలా బాగుంటాయి.

పరిహారం :- సోమవారం శివునికి అభిషేకం చేయించండి మంగళవారం నాడు కూడా ఆంజనేయస్వామికి సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయించండి 20వ తేదీ సాయంత్రం చంద్రుని దర్శించండి మంచి ఫలితాలు లభిస్తాయి.

సింహరాశి :- ఈ రాశివారికి సంపద లాభము ధనలాభము మృష్టాన్నము ఇలాంటివన్నీ వీరిని ఆనందింప చేస్తాయి. ఈ మధ్యకాలంలో ప్రతికూలతలు ఎక్కువగా ప్రారంభమయ్యాయి. ఫలితంగా ఇంతకుముందు అనుభవించిన వైభవం క్రమక్రమంగా వీరికి తగ్గుతూ ఉన్నాయి. అవి మిమ్మల్ని ఎంతవరకు ఇబ్బంది పెడతాయి అంటే ఇంట్లో ప్రతికూలతలు అలాగే బయట కూడా అవమానాలూ సంపాదించుకున్న గౌరవమర్యాదలు కూడా ఆటంకం కలుగుతుంది. రాజకీయ పరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఇబ్బందులు కలిగిస్తాయి. శస్త్ర చికిత్స పొంది కొంత ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వారం ఒక సమయంలో ని మీరు పడిన ఇబ్బందులు ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి స్థితి అవుతుంది. మీకు 42 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి.మఖా నక్షత్ర జాతకులకునైధన తార అయింది కాబట్టి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి అనుకూలమైన స్థితి ఉంది. ఉత్తర 1వ పాదం వారికి ప్రత్యక్ తార అయింది. కొంచెం ప్రతికూల స్థితి కనిపిస్తుంది.

పరిహారం :- కుజునకు జపం చేయించండి. 18వ తేదీ మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పూజ, శివాభిషేకము, ఆంజనేయ స్వామి పూజ మంచి ఫలితాలనిస్తాయి.

కన్యా రాశి :- ఈ రాశి వారికి ఈ సంతోష సౌఖ్యాలు కుటుంబ ఆనందాలే వీరికి మిగులుతాయి. ప్రతికూలతలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. రవి వ్యయం లోకి వచ్చిన తర్వాత వీరికి అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తృతీయాధిపతి అయిన కుజుడు అష్టమం లోకి రావడం కూడా శస్త్రచికిత్స వరకూ తీసుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. కుటుంబంలో తల్లిదండ్రులు చిన్న పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మీరు తీసుకోవడం వల్ల శుభమే జరుగుతుంది. ఎంత సంపాదించినా ధనవ్యయము తప్పదు. రాహుకేతువులు ధన వ్యయము అగౌరవము కలిగించ బోతున్నారు. కాబట్టి ప్రతికూలతలు. ఎక్కువగా ఉన్నాయి. మీరు అనుకున్న పనులు సాధించాలంటే దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుందని ఇంతకుమించి మీకు సహాయం చేసే వారు బయటి నుంచి ఎవరూ లేరు అని గుర్తిస్తే మీ పనులు ఎంతో చక్కగా జరుగుతాయి. మీకు ఈ వారంలో 35 శాతం మాత్రమే గ్రహ అనుకూలత ఉంది. ఉత్తరా నక్షత్రం 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్ తార అయింది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. హస్తా నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి శుభఫలితాలను వీళ్ళు బాగానే పొందగలుగుతారు అని చెప్పొచ్చు. చిత్త 1 2 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- సోమవారం నాడు శివాభిషేకము మంగళవారం నాడు కూడా శివాభిషేకము సుబ్రహ్మణ్య అర్చన మంచి ఫలితాలను ఇస్తాయి.

తులా రాశి :- ఈ రాశి వారు సుఖసౌఖ్యాలు ధన లాభాలతో అనంతమైన ఆనందాన్ని పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ పరంపర చాలా రోజులుగా కొనసాగుతూనే ఉంది. సౌఖ్యము ధనలాభము కార్యానుకూలత ఒక దాని మీద ఒకటి తోడై ఉక్కిరిబిక్కిరిగా ఆనంద పరుస్తాయి. అయితే ఒక్క శని ప్రభావం చేత అనారోగ్యానికి అవకాశం ఎక్కువగా ఉంది. అనారోగ్య సూచన మాత్రమే గుర్తించినట్లయితే మీరు ప్రతి దాంట్లో ప్రగతి సాధించుకుని ముందుకు వెళ్లి పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు గనుక వారిని ఎలాగోలాగా వారి భావాలను మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఈ వారంలో మీకు 67% గ్రహాల అనుకూలత పనిచేస్తూ ఉన్నాయి. మీరు పట్టిందల్లా బంగారం అంటే నమ్మరు కానీ అదే నిజం. కుటుంబంలో పెద్దవారికి నట్లయితే వారి ఆరోగ్యాన్ని జాగ్రత్త చూడండి. చిత్తా నక్షత్ర జాతకులకు 3 4 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి పరిస్థితి ప్రతికూలంగా నే ఉందని చెప్పాలి స్వాతి నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాలు విశాఖ 1 2 3 పాదాలు వారికి మాత్రమే జన్మతార అయింది అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారము : వినాయక చవితి నాడు పూజలు చేయండి చాలా మంచి ఫలితాలు వస్తాయి గురువారం నాడు సాయంత్రం చంద్రుని దర్శించండి.

వృశ్చిక రాశి :- ఈ రాశి వారికి శుభ ఫలితాలు కొంచెం ఆనందాన్ని కలిగించ బోతున్నాయి. సంతోషము సంపద కుటుంబ అభివృద్ధి అన్ని కలిసొస్తాయి. మంచి మంచి ఫలితాలు చూడడమే కాదు మంచి మంచి విషయాలు కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ఆనంద పరుస్తాయి. మిమ్మల్ని ద్వేషించే వారు ఈ వారంలో మీకు మిత్రులు అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి మిమ్మల్ని మరింత ఆనందింప చేస్తుంది. భూమి సంబంధించినటువంటి వ్యవహారము చక్కబడుతుంది. ఏమైనా బాధలు ఉన్నట్లయితే తొలగిపోతాయి. అంతే కాదు ఆకస్మిక ధన లాభం తో పాటు మీ పాత బాకీలు వసూలు అవకాశం కూడా ఉంది. అయితే అకారణమైనటువంటి కలహాలు మీమీద మీకు బాధ్యతలు పెరిగి అవమానాలు పొందే అవకాశం కూడా లేకపోలేదు. మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం చాలా అవసరము. మీకు ఈ వారంలో 54 శాతం గ్రహ అనుకూలతలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు నాలుగో పాదం వారికి జన్మతార అయింది. ప్రతికూలతలు అనారోగ్య సూచనలు ఉన్నాయి. అనూరాధ నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార అయింది. మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. జ్యేష్టా నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి కుటుంబ సభ్యులు చాలా శుభఫలితాలు ఎక్కువగా పొందుతారు.

పరిహారం :- సోమవారంనాడు మాస శివరాత్రి, సింహ సంక్రాంతి అభిషేకాదులు చేయండి మంచి ఫలితాలు వస్తాయి. అలాగే 18 తేదీ మంగళవారం నాడు కూడా కృష్ణ అంగారక చతుర్దశి మంచి సమయాన్ని వినియోగించుకోండి. గురువారంనాడు చంద్రోదయం కాబట్టి విదియ చంద్రుని దర్శనంచేయండి.

ధను రాశి :- ఈ రాశి వారికి విశేష ధనలాభము ఆనందము సంతోషాన్ని కలిగిస్తాయి ఆపైన మీరు ఈ వారంలో ఎప్పుడూ లేనంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. అనుకోని ఒత్తిడులు మీకు మానసికంగా శారీరకంగా కలిగి ఇబ్బంది పాలు అవుతారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. మీరు మీ కుటుంబ సభ్యులు అనారోగ్యాన్ని పొందే అవకాశం కూడా ఉంది. బయట పని ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో పనులు కూడా ఒత్తిడి తట్టుకోలేక మీరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన కూడా కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీర్ఘ వ్యాధిగ్రస్తులకు ముసలి వారికి ఇది గడ్డుకాలమే అవుతుంది సంబంధమైన ఇటువంటి ఆత్మ అనారోగ్యాలు గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ వారంలో గ్రహాల అనుకూలత 21 శాతం మాత్రమే కాబట్టి చాలా జాగ్రత్త వహించడం చాలా అవసరమని పదేపదే హెచ్చరించ వలసి వస్తోంది. మూలా నక్షత్ర జాతకులకు నైధనతార అయింది కాబట్టి ప్రతికూల పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి మాత్రము ప్రత్యక్తార అయింది కాబట్టి ప్రతికూలతలు చాలా ఎక్కువగానే ఉన్నాయి.

పరిహారము:- శని జపం చేయడం నల్లని వస్త్రము నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం చాలా అవసరం. మాస శివరాత్రి అభిషేకం చేయించండి మంచి ఫలితాలు లభిస్తాయి. మంగళవారం నాడు కృష్ణ చతుర్దశి రోజు అమ్మవారికి పూజ జరిపించండి విశేష ఫలితాన్ని పొందగలుగుతున్నారు.

మకర రాశి :- ఈ రాశి వారికి విశేష ధనలాభము సుఖభోగాలు కుటుంబంతో సుఖమైన జీవితము వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి రవి ప్రతికూల చేత పెద్ద విపత్తు అనారోగ్య సూచనలు ఉన్నాయి. కుజుని వల్ల శత్రువుల బాధలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు జ్ఞాపకశక్తి ఇబ్బంది కలగడం మీరు కొన్ని విషయాల్ని కొన్ని కుటుంబ వ్యవహారాలు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. శుక్రుడు ప్రతికూలత వల్ల అపకీర్తి పొందుతున్నారు. శని కుజుల మకర మీన రాశిలో ఉండటంవల్ల వారి ప్రభావం మీపై ఎక్కువగా ఉంది. లగ్నంలో ఉన్న శని మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాడు ఇవన్నీ చూసుకుంటే మీరు జాగ్రత్త పడటమే మార్గం. మీరు మాట్లాడడం తగ్గించి ఇతర కుటుంబాలతో వ్యవహారాలు నడిపే ఎటువంటి బాధ్యతలు సలహాలు ఇవ్వడం ఇలాంటి పనులకు దూరంగా ఉండండి. దాని వల్ల ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. మీకు ఈ వారంలో 42 శాతం మాత్రమే గ్రహ అనుకూలత ఉన్నది. ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రమే క్షేమ తార అయింది చాలా అనుకూలంగా ఉంది. ధనిష్ట 1 2 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి ప్రతికూలత ఉన్నట్లుగా భావించాలి

పరిహారము :- శనికి జపం చేయించడం నువ్వులనూనె నల్లని వస్త్రం నువ్వులు దానం చేయడం మంగళవారం నాడు దుర్గా పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి.

కుంభరాశి :- ఈ రాశి వారికి శుభ పరంపర శత్రునాశనం తో ప్రారంభం అవుతోంది. వీరికి ధనప్రాప్తి అలంకార ప్రాప్తి ఇలాంటివి కూడా ఒక దాని మీద ఒకటి ఆనందానికి అవధులు లేని స్థితికి తీసుకొని వెళతాయి. కుజుడు మీరు ఎంత సంపాదిస్తారో అంతా వెనక్కి తీసుకునే అటువంటి స్థితిని కల్పన చేస్తాడు. మీకు గురు శుక్రులు మంచి అనుకూలంగా ఉన్నారు పైగా కేతువు కూడా మీకు అనుకూలంగా శుభ ఫలితాన్ని ఇస్తాడు దీన్ని మీరు ఆసరాగా చేసుకొని ఇతరుల విషయాల్లో కొంత కల్పన చేసుకున్నట్లయితే మంచి పేరు ప్రఖ్యాతలు సుఖసౌఖ్యాలు ఆదాయము కూడా లభించే అవకాశం కల్పిస్తోంది. ఈ వారంలో మీరు 63% గ్రహాల అనుకూలతని పొందుతున్నారు. ఇంతకంటే మంచి రోజు మీకు ముందు రాబోతున్నాయి. వాటిలో మీరు దృష్టిలో పెట్టుకుని నట్లయితే ఈ వారం సద్వినియోగ పరచి ఉంటే చాలా వ్యవహారాలు మీరు చక్కబెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. శని కుజుల మధ్యలో మీ రాశి ఉండటం చేత ప్రతికూలత ఉంది.మిమ్మల్ని మీరు నిగ్రహించుకొని మిత్రుల బంధువుల దగ్గర ప్రవర్తించి ఉన్నట్లయితే ఇంకా చక్కని ఫలితాలను పొందగలుగుతారు. మీమీద మీకు విశ్వాసము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారంగా మారే వారం ఈ వారం అని మీరు చెప్పుకోవచ్చు. వ్యవహార జ్ఞానం తో మీ భూ సంబంధమైన కార్యక్రమాలు అలాగే ఉద్యోగ సంబంధమైన కార్యక్రమాలు చక్కబడతాయి. ధనిష్టా నక్షత్రం 3 4 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి ప్రతికూలత ఉంది. శతభిషా నక్షత్ర జాతకులకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి జన్మతార అయింది అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- శనికి నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రమును దానం చేయించండి మంగళవారం నాడు దుర్గా పూజ జరిపించండి. గురువారం నాడు విధేయ చంద్రుని దర్శించండి.

మీన రాశి :- ఈ రాశి వారికి మిత్రులతో సంబంధాలు స్త్రీ సౌఖ్యము అలంకార ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇలాంటి రోజులు ఇంతకు ముందు వచ్చినప్పటికీ మీలో ఒక ఉత్సాహము విశేష ధన సంపద మీ ఆనందానికి కారణం అవుతుంది. అయితే కుజ బుధుల ప్రతికూలత వల్ల చేతిలోనూ ఇంట్లోనూ డబ్బులు లేని పరిస్థితి కూడా ఎదురు అయ్యే అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం గురుని ప్రతికూలత వల్ల సకాలంలో లభించదు. కాబట్టి మీరు శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈసారి శని మీకు ధన ఆదాయాన్ని పెంచుతాడు. ఏ చిన్న అవకాశం మీకు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో వచ్చినట్లయితే విడిచిపెట్టకుండా ముందుకు సాగండి. శుక్రుడు మీకు మంచి భవిష్యత్ ప్రణాళిక ఇవ్వడానికి కూడా ఒక కారణమై ఉన్నాడు. మీకు మంచి ఫలితాలు కూడా లభిస్తున్నాయి. హృద్రోగ సూచన ఉంది కొంచెం జాగ్రత్త వహించి వైద్యులను సంప్రదించండి. మీకు ఈ వారంలో గ్రహాల అనుకూలత 42 శాతం మాత్రమే ఉన్నది. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి జన్మ తార అయింది ప్రతికూలతలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది. చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి ప్రతి పని అనుకూలంగా మారిపోతున్నది.

పరిహారం :- మంగళవారం నాడు పోలాలమావాస్య సుబ్రహ్మణ్య పూజ అమ్మవారి పూజలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. గురువారంనాడు విదియ చంద్రుని దర్శించండి.

Next Story