ఎన్నికల్లో 164 మంది కోటీశ్వరులు

By సుభాష్  Published on  25 Jan 2020 10:48 AM GMT
ఎన్నికల్లో 164 మంది కోటీశ్వరులు

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్‌ జరగనుంది. ఇక నామినేషన్‌ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సారి వివిధ పార్టీలకు చెందిన 164 మంది కోటీశ్వరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఎన్నికల్లో వీరి సంఖ్య 154 కాగా, ఆ సంఖ్య ఇప్పుడు 164కు చేరింది.

13 మంది ఆస్తులు రూ. 50 కోట్లకుపైనే..

బరిలో మొత్తం 164 మంది కోటీశ్వరులుండగా, 13 మంది ఆస్తులు రూ. 50 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది. అత్యంత ధనవంతులైన అభ్యర్థుల జాబితాలో తొలి నాలుగు స్థానాల్లో అధికార ఆప్‌ అభ్యర్థులే కావడం విశేషం. ఇక వీరిలో రూ.292 కోట్లతో ముంద్కా ఆప్‌ అభ్యర్థి ధర్మపాల్‌ లాక్రా మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఈయనే అత్యంత ధనవంతుడు. ఆ తర్వాత స్థానాల్లో ఆర్కేపురం నుంచి పోటీ చేస్తున్న ఆప్‌ అభ్యర్థి ప్రమీలా తోకస్‌ రూ. 80 కోట్లు, బదార్‌పూర్‌ అభ్యర్థి రామ్‌ సింగ్‌ నేతాజీ రూ.80 కోట్లు, పటేల్‌ నగర్‌ ఆప్‌ అభ్యర్థి రాజ్‌కుమార్‌ రూ.76 కోట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రియాంకా రూ.70 కోట్లు, బీజేపీ అభ్యర్థి బ్రహ్మ రూ.66 కోట్లు, కృష్ణా నగర్‌ బీజేపీ అభ్యర్థి అనిల్‌ రూ. 64 కోట్లు, బిజ్వసన్‌ బీజేపీ అభ్యర్థి సత్‌ ప్రకాశ్‌ రూ. 57 కోట్లు, రాజౌరి గార్డెన్‌ ఆప్‌ అభ్యర్థి ధన్వంతి రూ.56.9 కోట్లు. ఇలా రూ. 50 కోట్లకుపైగా ఆస్తులున్న 13 మంది అభ్యర్థుల్లో ఆరుగురు ఆప్‌, నలుగురు కాంగ్రెస్‌, ముగ్గురు బీజేపీకి చెందినవారున్నారు.

అత్యల్ప ఆస్తులున్న అభ్యర్థులు వీరే

ఇక పోటీ చేసే వారిలో అత్యల్ప ఆస్తులున్న అభ్యర్థులు ఐదుగురున్నారు. రూ. లక్ష కంటే తక్కువ ఉన్న వారిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేంద్ర నగర్‌ నుంచి బరిలో నిలిచిన రాకీ ట్యూసీడ్‌ ఆస్తి కేవలం రూ. 55 లక్షల 574. అంతేకాదు.. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఈయనే అత్యంత పిన్నవయస్కుడు.

Next Story