ఢిల్లీ సోషల్ మీడియా వార్‌లో 'ఆప్' ఖర్చే ఎక్కువ

By అంజి  Published on  25 Jan 2020 9:18 AM GMT
ఢిల్లీ సోషల్ మీడియా వార్‌లో ఆప్ ఖర్చే ఎక్కువ

ఢిల్లీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఆప్, కాంగ్రెస్, బిజెపిలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. అయితే ఢిల్లీ పోరులో ఒక ప్రధాన రణక్షేత్రం సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఖర్చుపెట్టే విషయంలో మాత్రం బిజెపి కన్నా ఆమ్ ఆద్మీ పార్టీయే ముందుంది. ఫేస్ బుక్ పారదర్శకత నివేదిక ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకూ గత నెల 4.4 లక్షల రూపాయలు ఖర్చు పెడితే , బిజెపి మాత్రం కేవలం రూ. 1.6 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది.

అయితే పార్టీలు నేరుగా తమ అఫీషియల్ పేజీల పేరిటే కాకుండా. తమ మద్దతుదారుల పేజీలు, పేరడీ పేజీలు, ఇతర పేజీలలో తమకు అనుకూలమైన కంటెంట్ ను ప్రచారం చేస్తాయి. ఇవి పార్టీల అధికారిక ఖర్చుల్లోకి రావు. ఈ విషయంలో బిజెపి, ఆప్ లు సమానంగానే ఉన్నాయి. అయితే అధికారిక పేజీల ఖర్చుల విషయంలో మాత్రం ఆమ్ ఆద్మీదే పైచేయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే బిజెపి పెట్టిన ఖర్చంతా సీఏఏ అంశంపై వాస్తవాలు తెలియచేయడానికే. తమాషా ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారిక పేజీ కూడా రూ. 2.4 లక్షలు ఖర్చుపెట్టింది. ప్రశాంతకిశోర్ కు చెందిన ఐప్యాక్ సంస్థ కూడా దాదాపు రూ. 12 లక్షలు ఖర్చుపెట్టింది. ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగానే చేసింది.

బిజెపి అనుకూల పేజీ “మై హూ దిల్లీ” 67 వేల రూపాయలు ఖర్చు చేసింది. అఫీషియల్ బిజెపి పేజీ కేవలం సద్గురు జగ్గీ వాసుదేవ్ సీఏఏ పై చేసిన వ్యాఖ్యల విడియోను ప్రచారం చేసేందుకే డబ్బులు ఖర్చు చేసింది. జనవరి 15 నుంచి 21 మధ్యలో బిజెపి డబ్బు ఖర్చు చేయలేదు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత మాత్రం ఫేస్ బుక్ ఎన్నికల అడ్వర్టయిజ్ మెంట్ల విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది. ప్రకటనలకు అనుమతిని తప్పనిసరి చేసింది. ఒక రాజకీయ యాడ్ పోర్టల్ ను ఏర్పాటు చేసి, అన్ని అడ్వర్టయిజ్ మెంట్ లను భద్రపరుస్తోంది. ఈ వివరాలను ఏడేళ్లపాటు పొందుపరచడం జరుగుతుంది.

అయితే ఒక అధ్యయనం ప్రకారం రాజకీయ పార్టీలు తమ అఫీషియల్ పేజీల్లో కాకుండా ఫ్యాన్ పేజీలు, ఫేక్ పేజీలు, ఫ్రెండ్లీ పేజీలు, పేరడీ పేజీల ద్వారా వ్యాపార ప్రకటనలను ఇస్తారు ఆయా పార్టీల అనుకూల కంటెంటును ప్రచారం చేస్తారు. దీనిని నియంత్రించడం అసాధ్యమని ఈ సర్వే చెబుతోంది.

Next Story