హైదరాబాద్‌లో ఒకే కుటుంబంలో 16 కరోనా కేసులు.!
By సుభాష్ Published on 18 May 2020 6:45 AM GMTహైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వైరస్ సోకిన కొద్ది మందిలో మాత్రమే అనారోగ్య సమస్యలు కనిపిస్తుండటం, మిగతా వారు ఆరోగ్యంగా ఉండటం అధికారులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా జియాగూడలో నమోదైన రెండు కరోనా పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం 94కు చేరుకుంది.
ఒకే ఇంట్లో 16 మందికి కరోనా
కాగా, మంగళ్ హాట్ లో ఒకే ఇంట్లో 16 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు సోదరులు, వారి పిల్లలు, మనుమరాళ్లు, మనుమళ్లు ఇలా మొత్తం 27 మంది ఆ ఇంట్లో ఉంటున్నారు. ఈ కుటుంబంలో ఇంటి యజమానికి కరోనా సోకి మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో మొత్తం 16 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 8 మంది చిన్నారులు ఉండటం బాధాకరం. కరోనాతో మరణించిన వ్యక్తి ద్వారా మిగతా ఇంటి సభ్యులకు కరోనా సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
కాగా, మంగళ్ హాట్ ప్రాంతంలో ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని (60)కి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. కుటుంబంలోని 27 మంది ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల ఆమె కొడలితో కలిసి కూరగాయల మార్కెట్ కు వెళ్లి వచ్చింది. అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కుటుంబంలో మరో ఇద్దరికి కరోనా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇలాంటి వారు హైదరాబాద్ నగరంలో ఎంతో మంది ఉన్నారు. ఏ మాత్రం అజాగ్రత్త వహించినట్లయితే కరోనా వెంట తెచ్చుకున్నట్లే.
మరింత ఆందోళన రేపుతున్న బర్త్ డే ఘటన
కాగా, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ బర్త్‌డే పార్టీ కారణంగా 23 మందికి కరోనా పాజిటివ్ తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. మాదన్నపేటలోని అపార్ట్ మెంట్‌లో ఓ బర్త్‌డే పార్టీ కారణంగా 23 మందికి కరోనా పాజిటివ్ తేలింది. ఆ పుట్టిన రోజు వేడుకకు హాజరైన మొత్తం 23 మందికి కరోనా తేలినట్లు అధికారులు తేల్చారు. ఈ కారణంగా ఆ ఆపార్ట్‌మెంట్‌లో 50 నుంచి 100 కుటుంబాలు చిక్కుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ ఘటన అపార్ట్ మెంట్ వాసులను కలవరపెడుతోంది. అంతేకాదు పక్కనున్న అపార్ట్ మెంట్ వాసులు కూడా భయాందోళన చెందుతున్నారు.
తెలంగాణలోని తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇలా ఒకరి ద్వారా ఒకరికి సోకి కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాకపోయినా.. జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కావడంతో అధికారులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. అధికార యంత్రాంగం ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా.. ఇంకా కేసులు నమోదు అవుతున్నాయి తప్ప తగ్గడం లేదు.