కర్ణాటకలో వరద బీభత్సం..13 మంది మృతి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Oct 2019 12:52 PM ISTకర్ణాటక: భారీ వర్షాలు, వరదలతో కర్ణాటక రాష్ట్రం కుదేలవుతోంది. కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 6 రోజుల్లో 13 మంది మృతి చెందారు. 10 వేల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 200 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బెళగావి, ధార్వాడ, చిత్రదుర్గ, బాగల్కోట్, హావేరీ, గదగ్, హుబ్బళ్ళి, కొడుగు, సవదట్టి జిల్లాలు నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రజలకు జనజీవనం నరకప్రాయంగా మారింది.
నదులు కూడా ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వంతెనలపై నుంచి నీరు ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. దీంతో రవాణా, విద్యుత్ సౌకర్యానికి పూర్తి అంతరాయం ఏర్పడింది. అయితే నిరాశ్రయుల కోసం ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. 28 పునరావాస కేంద్రాల్లో సుమారు 8 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు.
చిక్కోడిలో వరదనీరు గ్రామాలలోకి రావడంతో ఆంజనేయస్వామి ఆలయంలోకి నీరు చేరింది. సంకేశ్వర లక్ష్మీగుడి సమీపంలో వాహనాలు కొట్టుకుపోయాయి. సౌందట్టి ఎల్లమ్మ ఆలయం నీట మునిగింది. ఇక రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. గదగ్ జిల్లాలోని హోసూరు గ్రామంలో పాతకాలం నాటి ఇల్లు ఒకటి కుప్పకూలిపోయింది. ముందస్తు చర్యల్లో భాగంగా అందులో ఉన్నవారిని ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది.
పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోగా, కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు స్తంబించాయి. బెళగావి జిల్లా గోకాక్‌లో మల్లికార్జున కొండ నుంచి బండరాళ్లు జారి పడుతున్నాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. SDRF బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
తమిళనాడు, కేరళల్లోనూ వరదపోటు కొనసాగుతోంది. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరికొన్ని రోజులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.