ఐపీఎల్ ప్రారంభమై అప్పుడే 12 ఏళ్లు అయ్యిందా..
By తోట వంశీ కుమార్ Published on 18 April 2020 6:33 AM GMTఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. గల్లీ క్రికెటర్లను సైతం ఓవర్ నైట్ స్టార్ హీరోలుగా మార్చిన లీగ్ ఇది. ఇందులో ఆడితే.. డబ్బుకు కొదవ ఉండదు. ఒక్కసారి ఐపీఎల్ ఆడతే చాలు.. ఆర్థిక కష్టాలు అన్ని దూరం. జాతీయ జట్టులో చోటు దక్కక పోయిన ఫర్వాలేదు.. ఐపీఎల్‌లో ఆడాల్సిందే. ఇది వర్తమాన ఆటగాళ్ల ఆలోచన. ఇందుకు విదేశీ ఆటగాళ్లు ఏం మినహాయింపు కాదు.
భారత్ లో 5 రోజుల సాంప్రదాయ టెస్టు క్రికెట్, రోజంతా ఉండే వన్డే క్రికెట్ ఆదరణ తగ్గుతున్న రోజుల్లో పొట్టి ఫార్మాట్(టీ20) లో రుచిని చూపించింది ఐపీఎల్. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ రోజు రోజుకు ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. కాగా.. నేటికి ఈ లీగ్ ప్రారంభమై 12 ఏళ్లు.
2008 ఏప్రిల్ 18న మొదటి మ్యాచ్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరిగింది. మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఆటగాడు.. బ్రెండన్ మెక్‌కల్లమ్ సృష్టించిన విధ్వంసాన్ని క్రికెట్ ప్రేమికులు అంత త్వరగా మర్చిపోరు. ప్రత్యర్థి జట్టు పై బౌండరీలు సిక్సర్లతో విరుచుపడ్డాడు. కేవలం 73 బంతుల్లో 10 పోర్లు, 13 సిక్సర్లు బాది 158 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులు సాధించింది. కాగా.. భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో రాయల్ చాలెంజర్స్ 15.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. పొట్టి ఫార్మాట్‌లో ఉండే మజా ఏంటో ఈ మ్యాచ్ చూపించింది. బ్రెండన్ మెరుపులు మెరిపించినా.. కోల్‌కత్తాకు టైటిల్ ను అందుకోలేకపోయింది. కుర్రాళ్లతో నిండిన షేన్ వార్న్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ కప్పును అందుకుంది. అప్పటి స్టార్లతో నిండిన జట్లు డీలాపడ్డాయి. ఆఏడాది జరిగిన ఐపీఎల్ తో రవీంద్ర జడేలా, యూసప్ పఠాన్, బద్రినాథ్ వంటి యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు.
ఐపిఎల్ బ్రాండ్ వ్యాల్యూ ప్రతి ఏడాది పెరుగుతూ.. పోతోంది. ఇప్పటి వరకు 12 సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఈ లీగ్‌తో ఎందరో యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చి.. తమ తమ జాతీయ జట్లతో చోటు సాధించి స్టార్ క్రికెటర్లుగా వెలుగొందుతున్నారు. బీసీసీఐకి బంగారు బాతులా మారిన ఈ టోర్నీ క్రికెట్ ప్రపంచం పై ఎంతగా ప్రభావం చూపించిందంటే.. ఐపీఎల్ జరిగే టైంలో ఇతర క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించలేనంతగా. ఈ టోర్నీని చూసి చాలా దేశాలు.. టీ20 లీగ్ లను ఆరంభించిన ఆవేవి ఇంతగా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. ఒక్క 2009 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ సీజన్ నిర్వహించగా.. 2014 ఎన్నికల సమయంలో.. యూఏఈ వేదికగా సగం మ్యాచ్‌లను మాత్రమే జరిగాయి. కాగా.. ఈ ఏడాది మార్చి 29 నుంచి ఐపీఎల్-13వ సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా ముప్పుతో ఏప్రిల్ 15 వాయిదా పడింది. దేశ వ్యాప్త లాక్‌డౌన్ ను మే 3 వరకు పొడిగించడంతో.. నిరవధికంగా ఐపీఎల్ వాయిదా పడింది. ఈ సీజన్ గనుక రద్దు అయితే.. బీసీసీఐ రూ.3వేల కోట్లకు పైగా నష్టపోనుంది తెలుస్తోంది.