ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం.. 12మంది విద్యార్థులకు పాజిటివ్
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2020 4:11 PM ISTఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు కాలేజీ ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. ఉస్మానియాలో 296 మంది విద్యార్థులు ఉన్నారు. లాక్‌డౌన్ కారణంగా వీరంతా హస్టల్‌లో ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉస్మానియా హాస్టల్‌లో 180 మంది విద్యార్థినులు, 116 మంది విద్యార్థులకు పరీక్షలు చేయించారు.
116 మంది విద్యార్థుల సాంపిల్ ఫలితాలు ఈ రోజు రాగా.. 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. మిగిలిన వారి ఫలితాలు రేపు రానున్నాయి. విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో.. మెడికల్ కాలేజ్ ఆవరణ, హాస్టల్స్, మెస్ ప్రాంతాలను సానిటైజ్ చేశామని, భౌతిక దూరంతో పాటు పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ప్రిన్సిపల్ తెలిపారు.
కాగా.. ఐదు రోజుల క్రితం ఓయూ వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థికి పాజిటివ్ వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే దీనిని డీఎంఈ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ ఖండించారు. ఇక తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2792 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 88 మంది మృత్యువాత పడ్డారు.