మగధీర వచ్చి 11 ఏళ్ళు.. భారత చలన చిత్ర చరిత్రలో ఎందుకంత స్పెషల్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 July 2020 1:30 PM IST
మగధీర వచ్చి 11 ఏళ్ళు.. భారత చలన చిత్ర చరిత్రలో ఎందుకంత స్పెషల్..!

మగధీర.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా..! అప్పటికి రామ్ చరణ్ తీసింది కేవలం ఒక్క సినిమా మాత్రమే.. ఎంతైనా ఖర్చు పెట్టాలి.. అద్భుతమైన సినిమా తెరకెక్కించాలి అన్నది అల్లు అరవింద్ ఉద్దేశ్యం. అనుకున్నట్లుగానే ఓ భారీ బడ్జెట్ సినిమాను రూపొందించారు. సినిమా విడుదలైంది.. భారీ సక్సెస్ ను అందుకుంది. టాలీవుడ్ చరిత్రలోనే ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది మగధీర. ఈ సినిమా వచ్చి 11 సంవత్సరాలు అవ్వడంతో సామాజిక మాధ్యమాల్లో అభిమానులు సందడి చేస్తున్నారు.

రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమాను చూడడానికి అప్పట్లో జనం పోటెత్తారు. టాలీవుడ్ సినిమా ఈ రేంజిలో ఉంటుందా అని ప్రతి ఒక్క ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎంతో ఆశ్చర్యపోయారు. బైక్ స్టంట్, 100 మందిని చంపే సీన్, హార్స్ ఫైట్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, అబ్బురపరిచే క్లైమాక్స్.. ఇలా సినిమా మొత్తం కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. సినిమాను ఎన్ని సార్లు చూసినా.. రోమాలు నిక్కబొడుచుకుంటూనే ఉంటాయి.

ఈ సినిమాలో చిన్న పాత్రకు కూడా కథతో సంబంధం ఉండే ఉంటుంది. హీరో హీరోయిన్లే కాకుండా శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్, శరత్ బాబు, సునీల్.. ఇలా అందరూ సినిమాకు ఎంతో ప్లస్ అయ్యారు. ఇక ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అప్పటికి భారత సినిమా చరిత్రలోనే ట్రెండ్ సెట్టర్. రామ్ చరణ్ అటు హర్షగా, ఇటు కాలభైరవుడిగా రెండో సినిమాకే తన స్టామినా ఏంటో చూపించాడు. కాజల్ అగర్వాల్ ఇందు, మిత్ర వింద పాత్రల్లో వైవిధ్యాన్ని చూపించింది. వీరిద్దరి తర్వాత శ్రీహరి నటన సినిమాకే హైలైట్. షేర్ ఖాన్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

సినిమాకు మరో ప్లస్ ఏమిటంటే కీరవాణి సంగీతమనే చెప్పాలి. ముఖ్యంగా 'పంచదార బొమ్మ' సాంగ్ ఆల్ టైమ్ హిట్స్ లో నిలిచింది. ఓ వైపు నేపథ్య సంగీతం మరోవైపు ఈ పాటలు సినిమాకు ఆద్యంతం ఎంతో స్పెషల్ గానే నిలుస్తాయి. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ అద్భుతంగా పని చేయడంతో సినిమాకు మంచి అవుట్ పుట్ వచ్చింది.

అవార్డుల పరంగా కూడా మగధీర సినిమా చాలా వరకూ అవార్డులను కొల్లగొట్టింది. 57th నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ లో బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులను దక్కించుకుంది. తొమ్మిది నంది అవార్డులు, ఆరు ఫిలింఫేర్ అవార్డులను అందుకుంది. మావీరన్ పేరుతో తమిళంలో విడుదలవ్వగా, ధీర: ది వారియర్ పేరుతో మలయాళంలో విడుదలైంది.

మగధీర సినిమా రామ్ చరణ్ ను మరో స్టార్ ను చేసింది. మెగా స్టార్ చిరంజీవి కుమారుడిగా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ రెండో సినిమాతోనే తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత రచ్చ, నాయక్, ఎవడు, ధృవ లాంటి హిట్స్ రామ్ చరణ్ మార్కెట్ ను పెంచాయి. రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్.ఆర్. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

Next Story