తిరుప‌తిలో క‌రోనాను జ‌యించిన శ‌తాధిక వృద్ధురాలు.‌!

By Medi Samrat  Published on  26 July 2020 11:09 AM GMT
తిరుప‌తిలో క‌రోనాను జ‌యించిన శ‌తాధిక వృద్ధురాలు.‌!

తిరుపతి : ప్రపంచవ్యాప్తంగా క‌రోనా వైరస్ విజృంభిస్తుంది. చిన్నా-పెద్ద‌, పేద-ధ‌నిక తేడా లేకుండా వ్యాప్తి చెందుతుంది. అయితే క‌రోనా వ‌చ్చింది.. ఇక మ‌న ప‌ని ఖ‌త‌మ్‌.. అని అనుకునే వాళ్ల‌కు.. ఓ 101 ఏళ్ల బామ్మ క‌రోనా నుండి బ‌య‌ట‌ప‌డ్డ తీరు నిజంగా ఆద‌ర్శం. తిరుప‌తికి చెందిన‌ 101 ఏళ్ల మహిళ కొవిడ్ బారి నుండి కోలుకుంది. 25న తేదీన (నిన్న‌) తిరుపతిలోని కోవిడ్ -19 ఆసుపత్రి నుంచి విడుదలై ఔరా అనిపించింది.

వివ‌రాళ్లోకెళితే.. తిరుపతి నగరానికి చెందిన పి. మంగమ్మ అనే శ‌తాధిక వృద్ధురాలు కొన్ని వారాల క్రితం కరోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకుంది. రిపోర్టుల్లో ఆమెకు పాజిటివ్ రావ‌డంతో.. చికిత్స కోసం శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ - శ్రీ పద్మావతి మహిలా మెడికల్ కాలేజీ స్టేట్ కోవిడ్ -19 ఆసుపత్రిలో చేర్చారు. అక్క‌డ కోలుకున్న మంగ‌మ్మ నిన్న సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా డిచార్జ్ అయ్యింది.

ఈ విష‌య‌మై స్వీమ్స్‌ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ రామ్ మాట్లాడుతూ.. బాధితురాలి వయస్సును పరిగణనలోకి తీసుకుని.. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామ‌న్నారు. ఆసుపత్రి వైద్యులు, నర్సులు మరియు పారామెడికల్ సిబ్బంది బృందం ఆమె ఆరోగ్యం ప‌ట్ల ఎంతో కేర్ తీసుకుంద‌ని తెలిపారు. 101 ఏళ్లు పైబ‌డినా చికిత్సా స‌మ‌యంలో కోలుకోవ‌డంపై ఆమె ఏమాత్రం ఆశను కోల్పోలేదని అన్నారు. మంగ‌మ్మ కోలుకోవ‌డం.. ఇత‌రుల‌లోనూ ఆశ‌ను క‌లిగిస్తుంద‌న్నారు. మంగ‌మ్మ‌ చికిత్స విజ‌య‌వంతంగా పూర్తిచేసిన‌ ఆసుపత్రి వైద్యులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలావుంటే.. శనివారం మంగ‌మ్మ డిచ్చార్జ్ స‌మ‌యంంలో ఆసుప‌త్రి ప్రాంగ‌ణం భావోద్వేగంతో నిండిపోయింది. వైద్య, సహాయక సిబ్బంది ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. ముఖం మీద చిరున‌వ్వుతో మంగ‌మ్మ మ‌ర‌లా ఇంటికి తిరిగి రావ‌డంతో.. ఆమె కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రి సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Next Story
Share it