భారత్ కోసమే వంద మిలియన్ల వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2020 1:13 AM GMT
భారత్ కోసమే వంద మిలియన్ల వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాం

సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ శుక్రవారం నాడు మాట్లాడుతూ భారత్ కోసమే 100 మిలియన్ల కోవిద్-19 వ్యాక్సిన్లను తయారుచేస్తున్నామని స్పష్టం చేసింది. 2021 మొదట్లో కల్లా అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించే కొవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా సీరమ్ ఇన్ స్టిట్యూట్ లోనే ఉత్పత్తి కానుంది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను, నోవామాక్స్ కు చెందిన మరో కరోనా వ్యాక్సిన్ ను తామే ఉత్పత్తి చేస్తున్నామని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అడార్ పూనావాలా తెలిపారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఇందుకోసం 150 మినియన్ డాలర్ల ఫండింగ్ ను అందిస్తోంది.

కేవలం మూడు డాలర్లకే ఈ వ్యాక్సిన్ ను అందించనున్నామని కూడా స్పష్టం చేశారు. 92 దేశాలకు ఈ వ్యాక్సిన్ ను సరఫరా చేయనున్నామని కూడా తెలిపారు. అతి తక్కువ ధరలో ప్రపంచంలోని చాలా దేశాలకు వ్యాక్సిన్‌ను అందజేయడానికి యత్నిస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థతో పాటు.. బయలాజికల్-ఈ.. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్.. ఇలా పలువురు ప్రముఖులు ఒకే వేదిక మీదకు వచ్చి కరోనా వ్యాక్సిన్ మీద జరుగుతున్న పరిశోధనల గురించి తెలిపారు. భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ క్రిష్ణఎల్లా మాట్లాడుతూ.. ఒక వ్యాక్సిన్ తయారీకి కనీసం 14 నుంచి 15 ఏళ్ల సమయం పడుతుందని.. అందుకు భిన్నంగా కోవిడ్ కు పన్నెండు నుంచి పద్దెనిమిదినెలల్లోవ్యాక్సిన్ వృద్ధి చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

బయలాజికల్ -ఈ ఎండీ మహిమ దాట్ల స్పందిస్తూ.. వ్యాక్సిన్ల తయారీలో మనకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని.. దాంతోనే కోవిడ్ ను ఎదుర్కోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ ను తయారు చేయడాన్ని రేసుగా తాము భావించట్లేదని.. బాధ్యతగా అనుకుంటున్నట్లు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ సంస్థ ప్రతినిధి డాక్టర్ ఆనంద్ చెప్పారు. దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉంటే.. వారిలో 70 శాతం మందికి వ్యాక్సిన్ అవసరం ఉంటుందని.. అందుకే వ్యాక్సిన్ ధర వెయ్యి అనుకుంటే.. కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అందుకే.. అతి తక్కువ ధరకే వ్యాక్సిన్ అందించాలని తాము అనుకుంటున్నట్లు చెప్పారు. ఒక వాటర్ బాటిల్ ధర కంటే తక్కువగా వ్యాక్సిన్ ను అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే వ్యాక్సిన్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. అమెరికా చేతిలో నవంబర్ 3 నాటికి వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ ఉంటుందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ రేడియో కార్యక్రమం ద్వారా మాట్లాడిన ట్రంప్ కరోనా మహమ్మారి అంతానికి రోజులు దగ్గర పడుతున్నాయని తేల్చేశారు. వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలు ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు.

Next Story
Share it