అభినందనే గూగుల్ సెర్చ్ లో టాప్..!
By జ్యోత్స్న Published on 12 Dec 2019 10:41 AM ISTమనకి ఏ సమాచారం కావాలన్నా, అవగాహన పెంచుకోవాలన్న ముందుగా గుర్తొచ్చేది గూగుల్, అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్లో సైతం గూగుల్ సెర్చ్ లో మనకి కావలసిన అంశాన్ని టైప్ చేస్తే చాలు మొత్తం సమాచారాన్ని అందించేస్తుంది. ఒక విషయం గురించి తెలుసుకోవాలన్నా, వ్యక్తి గురించి ఆరా తీయాలన్నా దేనికైనా మనకు గూగులే ఆధారం. ఇలా మనం వెతికిన వాటి గురించి ఏటా కొన్ని జాబితాలను గూగుల్ కంపెనీ ప్రకటిస్తుంటుంది. ఈ సారి కూడా పలు అంశాలతో కూడిన వివిధ రకాల జాబితాలను విడుదల చేసింది. అలాంటి జాబితాల్లో ఒకటి ‘మోస్ట్ ట్రెండింగ్ పర్సనాలిటీ’. మరో 20 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఈ జాబితాను గూగుల్ ప్రకటించింది. ఇందులో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మొదటి స్థానంలో నిలిచారు.
శత్రు సైనికుల చెరలో ఉన్నా, అత్యంత విపత్కర పరిస్థితులు ఎదురైనా, మొక్కవోని ధైర్యంతో ఉన్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్. శత్రుదేశం చేతుల్లోకి చిక్కినప్పటికీ తలవంచకుండా గుండె నిబ్బరంతో నిలిచారు. ఆయన ధైర్యసాహసాలు మెచ్చి కేంద్ర ప్రభుత్వం వీర్‌చక్రతో సత్కరించింది. దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన 2019లో గూగుల్‌లో మోస్ట్ ట్రెండింగ్ పర్సనాలిటీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఇండియా లోనే కాదు పాకిస్తాన్ గూగుల్ సెర్చ్ లో కూడా అభినందన్ టాప్ 10 లో నిలిచారు. ఇక గాన కోకిలగా అభిమానులు పిలుచుకునే లతా మంగేష్కర్ రెండో స్థానంలో నిలిచారు.
నవంబర్ 11న ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారన్న వార్త రాగానే చాలా మంది గూగుల్‌లో ఆమె గురించి తెలుసుకున్నారు.మూడో ప్లేస్‌లో క్రికెటర్ యువరాజ్ సింగ్ నిలిచాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో అతడి గురించీ గూగుల్‌లో సెర్చ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాణు మండల్ టాప్ 10లో ఏడో స్థానంలో ఉన్నారు.