కోహ్లీ భయపడుతున్నావా..? : చాహల్
By తోట వంశీ కుమార్ Published on 13 May 2020 8:50 PM ISTటీమ్ఇండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ చాలా సరదాగా ఉంటాడు. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో చాహల్‌కు మంచి అనుబంధం ఉంది. విరాట్ కానీ, అతని సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కానీ ఏ వీడియో పోస్టు చేసినా ఫన్నీగా సమాధానాలు ఇస్తుంటాడు. కరోనా మహమ్మారి కారణం ప్రస్తుతం ఇంటికే పరిమతమైన ఈ లెగ్‌స్పిన్నర్ సోషల్ మీడియాలో మయా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఎంతలా అంటే.. తన సహచర ఆటగాళ్లు విసిగిపోయేంతగా. చాహల్ బాధ భరించక లేక యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అతడి ఎకౌంట్ ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.
బయట ఎంత సరదాగా ఉంటాడో మైదానంలోనూ అలాగే ఉంటాడు చాహల్. తన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ల భరతం పట్టే ఈ స్పిన్నర్.. మ్యాచ్ అనంతరం 'చాహల్ టీవీ' పేరుతో ఆటగాళ్లను ఇంటర్వ్యూలు సైతం చేస్తుంటాడు. ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బెంగళూరు జట్టు చాహల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియలో పోస్టు చేసింది.
2008-09 కూచ్ బెహర్ ట్రోఫీలో చాహల్ సెంచరీ చేసిన విషయాన్ని ఆర్‌సీబీ గుర్తు చేసింది. హిమాచల్‌ప్రదేశ్ అండర్-19 జట్టుపై చాహల్ 135, 46 పరుగులు చేశాడని తెలిపింది. ఆ సీజన్‌లో చాహల్ మొత్తం 281 పరుగులు చేశాడని, అతడిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపాలని సూచించింది.
దీనిపై చాహల్ స్పందించాడు. 'కోహ్లీ భయ్యా భయపడుతున్నావా..? నేనెక్కడ నీ నెంబర్ 3 స్థానాన్ని ఆక్రమించుకుంటానోనని.. 'అంటూ కామెంట్ చేశాడు. దీనికి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కౌంటర్ వేశాడు. 'అది ఖచ్చితంగా.. ఎగ్జిబిషన్ మ్యాచ్ అయి ఉంటుందని' సరదాగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.