ఆ మ్యాచ్ త‌రువాత ఎన్నో నిద్ర‌లేని రాత్రులు గ‌డిపా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2020 11:04 AM GMT
ఆ మ్యాచ్ త‌రువాత ఎన్నో నిద్ర‌లేని రాత్రులు గ‌డిపా..

టీమ్ఇండియా 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌కప్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు యువ‌రాజ్ సింగ్‌. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో కీల‌క వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. కాగా.. 2014లో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను త‌న జీవితంలో మ‌రిచిపోలేన‌ని అంటున్నాడు ఈ భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్.

2014 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో టీమ్ఇండియా తృటిలో క‌ప్ కోల్పోయింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో యువ‌రాజ్ సింగ్ 21 బంతుల్లో 11 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో మ్యాచ్ అనంత‌రం యువ‌రాజ్ పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ విష‌యాన్ని యువ‌రాజ్ సింగ్ మ‌రోసారి గుర్తుచేసుకున్నాడు.

ఆ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఓట‌మికి పూర్తిగా తానే నైతిక బాధ్య‌త వ‌హిస్తున్నాన‌ని యువీ చెప్పాడు. నిజానికి ఆరోజు తాను అనుకున్నంత వేగంగా బ్యాటింగ్ చేయ‌లేక‌పోయాన‌ని తెలిపాడు. దేశం మొత్తం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా బావించే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ కావ‌డం దుర‌దుష్ట‌క‌ర‌మ‌ని, అదే వేరే మ్యాచ్ అయితే ఇంత‌గా బాధ‌ప‌డేవాడిని కాద‌న్నాడు. ఆ మ్యాచ్ తాలుకా ప్ర‌భావం త‌న‌పై గ‌ట్టిగానే ప‌డింద‌న్నాడు. చాలా రోజులు నిద్ర‌లేని రాత్రులు గ‌డిపాన‌ని చెప్పుకొచ్చాడు యువీ.

ఆ మ్యాచ్ త‌రువాత స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చాక విమానాశ్ర‌యం నుంచి బ‌య‌టికి రాగానే మీడియా నాపై దాడి చేసింద‌ని, అరుస్తూ వెంట‌ప‌డింద‌ని, నా చెవిలో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డి ఇంటికి వ‌చ్చాక త‌ననో నేర‌స్తుడిలా చూశార‌ని, ఇంటి మీద రాళ్ల‌తో కూడా దాడి చేశార‌ని తెలిపాడు. ఆ స‌మ‌యంలో నాకు నేనే నేర‌స్తుడిలా అనిపించాన‌ని, నేనెవ‌రినో చంపి జైలుకు వెళుతున్న ఫీలింగ్ కూడా క‌లిగింద‌న్నాడు. ఆ త‌రువాత దాని నుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని చెప్పాడు.

కాగా.. 2011 ప్రపంచకప్‌ తర్వాత యూవీ కాన్సర్‌ బారీన పడ్డాడు. లండన్‌కు వెళ్లి శస్త్ర చికిత్స తీసుకొనివ‌చ్చి తిరిగి భార‌త జ‌ట్టు త‌రుపున ఆడాడు. అయితే.. గ‌తంలో లాగా త‌న త‌న దూకుడును చూపించ‌క‌లేక‌పోయాడు. 2014 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 130 ప‌రుగులు చేయ‌గా.. శ్రీలంక 17.5 ఓవ‌ర్ల‌లోనే నాలుగు వికెట్లు కోల్పోయి 134 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ఆ మ్యాచ్ లో యువ‌రాజ్ చివ‌రి ఓవ‌ర్ల‌లో బ్యాటింగ్ కి వ‌చ్చి ధాటిగా ఆడ‌లేక‌ చేయ‌క‌పోవ‌డంతో అత‌డిపై విమ‌ర్శలు వెల్లువెత్తాయి.

Next Story