రేపు 'వైఎస్‌ఆర్ కాపు నేస్తం' పథకం ప్రారంభం

By సుభాష్  Published on  23 Jun 2020 10:24 AM IST
రేపు వైఎస్‌ఆర్ కాపు నేస్తం పథకం ప్రారంభం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలన పరంగా దూసుకెళ్తున్నారు. పాలన పగ్గాలు చేపట్టిన ఏడాదిలోనే ఎన్నో పథకాలు చేపట్టి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజాదరణ పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోతున్నా.. ప్రజల కోసం సరికొత్త పథకాలను సైతం అమలు చేస్తున్నారు. తాజాగా మహిళల కోసం మరో వినూత్న పథకాన్ని అమలు చేయబోతున్నారు. బుధవారం 'వైఎస్సార్‌ కాపు నేస్తం' పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు యేటా రూ.15వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75వేల ఆర్థిక సాయం అందనుంది. తొలి ఏడాది దాదాపు 2.36 లక్షల మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. నేరుగా వారి వారి ఖాతాల్లో రూ.15వల చొప్పున జమ చేస్తారు. ఈ పథకం కింద ఈ ఏడాది రూ.353.81 కోట్లు ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం.

ఈ పథకం కాపు, బలిజ, తెగ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల వయసున్న వారికి ఈ పథకం వర్తించనుంది. ఈ పథకంలో అర్హులు కావాలంటే కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.1.44 లక్షలు మించకూడదు. అలాగే ఆ కుటుంబానికి 3 ఎకరాలలోపు తరి లేదా పది ఎకరాల మెట్ట భూమి ఉండాలి. రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఎలాంటి ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా ఇతర ఏ నిర్మాణాలు ఉండరాదు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు. ప్రభుత్వ పెన్షన్‌ కూడా పొందరాదు. అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండరాదు. ఇక ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్‌కు మినహాయింపు ఇచ్చారు. ఈ 'వైఎస్సార్‌ కాపు నేస్తం' పథకం లబ్దిదారుల ఎంపిక పాదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

Next Story